
పారిశ్రామికవేత్తలకు నిరాదరణ
● పరిశ్రమలు, ఎగుమతి కమిటీ సమావేశంలో కలెక్టర్ సీరియస్ ● రాయితీలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం
సాక్షి, పాడేరు: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పరిశ్రమలు, సేవారంగ సంస్థలను నెలకొల్పిన 150మందికి రాయితీలు అందించలేదన్నారు. రాయితీలు విడుదల చేయడానికి చర్యలు తీసుకోలేదని, 10 క్లెయింలు కూడా పరిష్కరించలేదని పరిశ్రమలశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రాయితీలు అందించాలన్నారు. ప్రతి మండలంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులుగా నియమించి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. పరిశ్రమలు, క్రషర్ల నుంచి వస్తున్న కాలుష్యంపై ఫిర్యాదులు అందుతున్నాయని, నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్రషర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.రవిశంకర్, ఏడీ రమణారావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.