
నాలుగు పుస్తకాల ఆవిష్కరణ
సీతంపేట: విశాఖ సంస్కృతి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం ఒకేసారి నాలుగు పుస్తకాలు ఆవిష్కరించారు. విశాఖ సంస్కృతి 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో అతిథుల చేతుల మీదుగా నాలుగు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. రచయిత మోణంగి ప్రవీణ రచించిన తొలి అడుగులు కథా సంపుటి, గన్నవరపు నరసింహమూర్తి రచించిన మిథునం, గన్నవరపు నరసింహమూర్తి కథలు, మంచి సినిమాల పుస్తకాలను అతిథులు పూర్వ ఎంపీ డి.వి.జి.శంకరరావు, గరివిడి పశు వైద్యశాల డీన్ డాక్టర్ మక్కెన శ్రీను, అఖిల భారత ధర్మకర్త చెరువు రామకోటయ్య, సత్య విద్యా సంస్థల డైరక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఆవిష్కరించారు. అనంతరం విశాఖ సంస్కృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం, తెలుగు భాష ఉన్నతికి 13 ఏళ్లుగా పాటుపడుతున్న విశాఖ సంస్కృతి మాస పత్రిక సంపాదకుడు శిరేల సన్యాసిరావు నిస్వార్థ కృషిని అభినందించారు. మంచి ఇతివృత్తం ఉన్న కథలు, సాహిత్యం, చారిత్రక అంశాలు, కవితలు ప్రతి నెలా అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హాస్య కథలు, కవితల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రచయిత మేడా మస్తాన్‌రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.