
చంద్రబాబు పర్యటన వల్ల ఒరిగింది శూన్యం
అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: ఆదివాసీ దినోత్సవం నాడు ఏజెన్సీ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన వల్ల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని.. మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగం కల్పిస్తే ఆదివాసీల జీవితాలు బాగుపడతాయని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్రం కార్యాలయంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మితో గిరిజన ఉద్యమ నేతలకు పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. అనంతరం వారు అక్కడి ఫోన్‌లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. గిరిజనులకు కావల్సింది పింఛన్ కాదని, వారికి మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం అందించాలని కోరారు. దేశంలో పింఛన్లు కేవలం మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నట్లు ఆభూత కల్పనలు, కల్లబొల్లి మాటలతో గిరిజనులను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పే అబద్దపు మాటలు నమ్మే పరిస్థితుల్లో గిరిజనులు లేరని అన్నారు. పాడేరు పర్యటనలో అర్థపర్థం లేకుండా నిండు సభలో మాట్లాడారన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అందరికీ పడిందా లేదా అని అందరికీ పడే ఉంటుందిలే అని చెప్పి ఖాతాలో డబ్బులు జమ అయిన వారు చెయ్యి పైకెత్తాలనడం ఎంతవరకు సబబు అన్ని ప్రశ్నించారు. గిరిజనులకు కావల్సింది జీవో నంబరు 3పై స్పష్టత, 1/70 చట్టాం పటిష్టంగా అమలు, గిరిజనులు పండించే కాఫీ, మిరియం పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయన అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జిల్లాలో అరకొరగా జమ అయ్యాయని, పూర్తిస్థాయిలో పథకాలు వర్తించలేదని అన్నారు. ఇదే పాడేరులో అనేకసార్లు పర్యటించిన చంద్రబాబు గిరిజనులకు చెప్పకోదగ్గ ఏంమేలు చేశారని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ గిరిజనుల కొరకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే తపనతో పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టడాన్ని వారు గుర్తు చేశారు. దేశ చరిత్రలో గిరిజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినది జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వారు పేర్కొన్నారు.
గిరిజనులకు అవసరమైనది మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ధ్వజం