
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కు గోప్యంగా భూమిపూజ
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధి పార్వతీ నగర్ వద్ద 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే (పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్) జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించి అధికారులు, మెగా కంపెనీ సిబ్బంది కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంప్డ్ స్టోరేజీ ఏడీఈ టి. అప్పలనాయుడు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక నేతలు, నిర్వాసితులకు మెగా కంపెనీ, జెన్‌కో అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. భూమి పూజ కార్యక్రమ సమాచారం తెలుసుకున్న సర్పంచ్ దుర్జో, కూటమి నేతలు, ఆదివాసీ సంఘాలు అక్కడికి చేరుకున్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇతర వసతులు, ఉపాధి కల్పించకుండా భూమి పూజ గోప్యంగా ఎలా నిర్వహిస్తారని ఏడీఈ అప్పలనాయుడు, మెగా కంపెనీ ఏజీఎం రవిబాబును వారు నిలదీశారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత అధికారికంగా ప్రొటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులు, స్థానికులు, సంబంధిత మంత్రులు, జెన్‌కో ఉన్నతాధికారులు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని మెగా కంపెనీ మాత్రమే నిర్వహించిందని ఆయన చెప్పారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతనే భూమి పూజ నిర్వహించాలని, అప్పటివరకు నిలిపివేయాలని వారు పట్టుబట్టారు. ఇకపై ఏంచేసినా మీకు తెలిజేస్తామని మెగా కంపెనీ ఏజీఎం రవిబాబు చెప్పడంతో వారు శాంతించారు. నిర్వాసితులకు న్యాయం చేయకుంటే ప్రాజెక్ట్ పనులు అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు.
నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఎలా చేస్తారని ప్రశ్నించిన సర్పంచ్,
ఆదివాసీ సంఘాలు

పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కు గోప్యంగా భూమిపూజ