
సన్ షైనర్స్ ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నాలుగో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్ షైనర్స్.. రాయలసీమ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండు జట్ల నుంచి ఆటగాళ్లు అశ్విన్ హెబ్బర్, అవినాష్ సెంచరీలు చేసే అవకాశాలను త్రుటిలో కోల్పోయారు. సన్ షైనర్స్ టాస్ గెలిచి లక్ష్య ఛేదనకు మెగ్గు చూపడంతో రాయలసీమ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. అవినాష్ (96 పరుగులు) అద్భుతంగా ఆడి జట్టు స్కోరును పెంచాడు. అతను 39 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో అవుటవ్వడం అభిమానులను నిరాశపరిచింది. గిరినాథ్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విజయవాడ బౌలర్లలో లలిత్ మోహన్, రాజు రెండేసి వికెట్లు పడగొట్టారు. 197 పరుగుల లక్ష్య ఛేదనలో విజయవాడ సన్ షైనర్స్ కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ (98 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్లతో అశ్విన్ సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. అతనితో పాటు తేజ(77 పరుగులు) కూడా దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సన్ షైనర్స్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాయలసీమ బౌలర్ సాకేత్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
వారియర్స్ జోరు.. లయన్స్ బేజారు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్‌లో తుంగభద్ర వారియర్స్ బోణీ కొట్టింది. వైఎస్సార్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో శనివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ మహీప్ కుమార్ (57) అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించగా, బౌలర్లు సమష్టిగా రాణించి లయన్స్ పతనాన్ని శాసించారు. అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ (40) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. జట్టు 48 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రికీ భుయ్ (2) సహా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. సందీప్ (11), చివర్లో ధీరజ్ లక్ష్మణ్ (22) మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. వారియర్స్ బౌలర్లలో మీడియం పేసర్ తోషిత్ మూడు, సిద్ధార్థ్, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 110 పరుగుల లక్ష్య ఛేదనలో తుంగభద్ర వారియర్స్‌కు కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్ శ్రీ సామాన్యు (3) త్వరగానే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహీప్ కుమార్‌తో జతకట్టిన మరో ఓపెనర్ జ్ఞానేశ్వర్ (40) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ పవర్‌ప్లేలోనే స్కోరు బోర్డును 62 పరుగులకు చేర్చి మ్యాచ్‌పై పట్టు సాధించారు. కెప్టెన్ మహీప్ కుమార్ 57 పరుగులతో అద్భుత అర్ధశతకాన్ని నమోదు చేశాడు. దీంతో తుంగభద్ర వారియర్స్ 12.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసి విజయం సాధించింది.
అశ్విన్, అవినాష్ సెంచరీలు మిస్
ఉత్కంఠగా ఏపీఎల్