
జోరుగా సాగు
● పొలం బాట పట్టిన గిరి మహిళలు
● చివరి దశలో వరి నాట్లు
● చోడి నూర్పుల్లో రైతులు నిమగ్నం
వాతావరణం అనుకూలం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అనుకూలించాయి. దీంతో మెట్టు పంటలతో పాటు వరినాట్లు తొందరగా వేసుకున్నాం. సామ, అల్లం పంట చేతికందివచ్చింది. సామతో పాటు అల్లంకు మంచి ధర లభించింది. చోడి పంట ఆశాజనకంగా ఉంది. మరో రెండు నెలలు వర్షాలు అనుకూలిస్తే వరి పంటతోపాటు కూరగాయలు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
– బురిడి పాపారావు, రైతు,
లంతంపాడు, అరకులోయ
అరకులోయటౌన్: మండలంలో పలు ప్రాంతాల్లో గిరిజన మహిళలు పొలంబాట పట్టారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఓ పక్క ట్రాక్టర్‌లు, పవర్ టిల్లర్‌లతో దమ్ము చేస్తుంటే మరో పక్క వరి నాట్లు వేస్తున్నారు. మరో వైపు వరి నారు తీసి కట్టలు కడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరినాట్లు, చోడి నూర్పిడి, ఇతర వ్యవసాయ పనుల్లో గిరిరైతులు నిమగ్నమై ఉన్నారు. అరకులోయ వ్యవసాయశాఖ సబ్ డివిజన్ పరిధిలో వరినాట్లు చివరి దశకు చేరగా, సామలు పంట చేతికందడంతో కోతకోసి నూర్పిళ్లు చేపడుతున్నారు. ఈ ఏడాది సబ్ డివిజన్ పరిధిలో సుమారు 16వేల హెక్టార్లు వరి సాగులో ఉండగా, 9,300 హెక్టార్లలో రాగులు, సాగులో ఉండగా, అల్లం, మిరప, ఇతర కూరగాయలు మరో 535 హెక్టార్లలో పండిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ఏడీ వంగవీటి మోహాన్‌రావు తెలిపారు. అల్లం విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున వర్షాలు వరి పంటతోపాటు చోడి ఇతర మెట్టు పంటలైన మిరప, కూరగాయలు, అల్లం పంటలకు ఎంతో ఉపయోగకరమని రైతులు చెబుతున్నారు.

జోరుగా సాగు

జోరుగా సాగు