
విద్యార్థులకు సామాజిక దృక్పథం అవసరం
ఎంవీపీకాలనీ: విద్యార్థులకు జ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, విలువల పెంపొందించడంలో గురుకులాల పాత్ర కీలకమని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సత్యనారాయణ అన్నారు. విద్య ఒక్కటే వారి భవిష్యత్‌కు కొలమానం కాకూడదని ఆయన సూచించారు. ఆ దిశగా ప్రభుత్వ ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు యువతను ప్రోత్సహించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జోన్–1 జిల్లాల అధికారులు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక విలువలు తగ్గుముఖం పట్టడం వల్ల యువతలో నేర ప్రవృత్తి, బాధ్యతారాహిత్యం, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీసీ సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లలో అవగాహన పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు సామాజిక దృక్పథం పెంచడం వల్ల విద్యార్థుల్లో విలువలతో కూడిన జీవితం అలవడుతుందన్నారు. ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు రెసిడెన్షియల్ విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలని, రోజంతా వారితో మమేకం కావాలని సూచించారు. బయటి సమాజంతో పోలిస్తే రెసిడెన్షియల్ విద్యార్థుల అభివృద్ధిలో సవాళ్లు ఎక్కువ, సౌకర్యాలు తక్కువ ఉన్న మాట వాస్తవమే అయినా.. ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు తమ విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించవచ్చన్నారు. అవసరమైన మేరకు సీఎస్సార్ నిధులను కూడా సేకరించుకోవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు మాట్లాడుతూ యువతకు చదువు ప్రాముఖ్యత, అవకాశాలు, లక్ష్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, మానసిక నిపుణుడు ఆచార్య ఎం.వి.ఆర్.రాజు మాట్లాడుతూ వసతిగృహాలు, కళాశాలల్లో కల్పించే ప్రశాంతమైన వాతావరణమే విద్యార్థుల మంచి భవిష్యత్‌కు బాటలు వేస్తుందన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ బీసీ రెసిడెన్షియల్ వసతిగృహాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 77శాతంగా ఉందని, ఇందులో 17శాతం మంది ఫస్ట్ క్లాస్ సాధించినట్లు తెలిపారు. ఈ శాతాన్ని మరింత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పి.మాధవీలత, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సత్యనారాయణ