
ప్రత్యేక జీవనం.. బోండా జాతి సొంతం
ముంచంగిపుట్టు: ఈ ఆధునిక ప్రపంచంలో కేవలం పూసల్నే దుస్తులుగా ధరిస్తూ జీవిస్తున్న ఆదివా సీలైన బోండా జాతి గిరిజనం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివాసమున్నారు. కాలం మారుతున్నప్పటికి వీరి జీవన విధానం, ఆచార సంప్రదాయ సంస్కృతిని పాటిస్తూ జీవన మనుగడ సాగిస్తున్నారు. ప్రకృతితో మమేకమై స్వచ్చమైన మనస్సుతో జీవించే మనషులు బోండా జాతి ఆదివాసిలు. ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాకు చెందినా అండ్రహల్, ఒనమనాల్ గిరిజన గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో బోండా జాతి గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని నాలుగు పంచాయతీల్లో 32 గ్రామాల్లో బోండా జాతీ గిరిజనులు నివసిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల మాటునా ఈ గ్రామాలున్నాయి. వీరి జీవన విధానం ప్రత్యేకం..కుటుంబంలో మహిళలదే పెత్తనం. కుటుంబం కోసం కష్ట పడేది కూడా మహిళలే. బోండా జాతి మహిళలు కేవలం పూసల్నే దుస్తులుగా ధరించి నేటికి జీవిస్తున్నారు. అటవీ ప్రాంతంలో దొరికే కొండచీపుళ్లు, తేనె, అడ్డాకులు, దుంపలు, వెదురు కొమ్ములు, జీలుగుకల్లు వంటివి సేకరించి వాసపు సంతకు వచ్చి అమ్మకాలు చేపడతారు. ఆ గ్రామాల గిరిజనులకు సరిహద్దులో జరిగే ఒనకడిల్లీ వారపు సంతే దిక్కు. ప్రతి గురువారం ఇక్కడ జరిగే వారపు సంతలో మాత్రమే బోండా జాతి గిరిజనులు కనిపిస్తారు. వీరిని చూసేందుకు పర్యాటకులు వస్తుండడం విశేషం. ఫొటోలు తీసుకునేందుకు బొండాజాతీయులు వ్యతిరేకిస్తుంటారు. దీంతో ఆయుష్ష తగ్గుతుందని వారి నమ్మకం.వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే దాడికి దిగుతారు. కొంతమంది బొండా ఆదివాసీలు ఒక్కో ఫొటో తీసుకునేందుకు రూ.500ల వరకు తీసుకుంటారు. బోండా జాతి ఆదివాసీలను చూసెందుకు ఏటా అక్టోబర్ నుంచి జనవరి నెల వరకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఆయా సీజన్‌లలో ఎక్కువగా పండించే, లభించే అటవీ ఉత్పత్తులను ఒనకడిల్లీ వారపు సంతకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వారు తీసుకొచ్చే తేనె, పసుపు, వెదురు, జీలుగుకల్లుకు ఎక్కువగా డిమాండ్ ఉంది. సంతంతా బోండా జాతి మహిళలతో సందడిగా కనిపిస్తాది.
అభివృద్ధి పథంలో...
ఆధునీకరణకు దూరంగా జీవనం సాగిస్తున్న బోండా జాతి ఆదివాసీలను జీవన విధానంల మార్పు తీసుకొచ్చేందుకు ఒడిశాకు చెందినా ఆశా కిరాణ్ అనే స్వచ్ఛంద సంస్థ నడుంబిగించింది. మొదటిగా గ్రామంలోని చిన్నారులకు విద్యను అందించాలని ఉద్దేశ్యంతో పాఠశాలలను ఒడిశా ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసింది. బోండాజాతి చిన్నారులను పాఠశాలలకు తీసుకొచ్చి విద్యావంతులుగా తీర్చి దిద్దింది. సుమారు పదేళ్లు తరువాత వారికి పూర్తిస్థాయిలో విద్యాబుద్ధులు నేర్పగలిగింది. ప్రస్తుత బొండాజాతి ఆదివాసీల్లో మార్పు వచ్చింది. పలువురు పట్టణాల్లో నర్సులుగా, హోమ్‌గార్డులుగా పలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్తున్నారు.
ప్రస్తుతం మారిన బోండా జాతి తరం పిల్లలు వారి తల్లిదండ్రులు, పెద్దలకు నేటి నాగరికతను తెలియాజేస్తు వారి జీవన విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. వీరికి కుల, ఆదాయ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం, చిన్నారులకు పాఠశాలల్లో రాయితీలు కల్పించడంలోనూ ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారి గ్రామాల్లో పక్కా రహదారులు సైతం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మారుతున్న ఆదివాసీల మనుగుడ
మారుతున్న జీవన శైలి

ప్రత్యేక జీవనం.. బోండా జాతి సొంతం