
అసత్య ఆరోపణలు మానుకోవాలి
● గిడ్డి ఈశ్వరికి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
● మాటతీరు మార్చుకోవాలని హెచ్చరిక
పాడేరు : గిరిజనుల విశ్వాసాన్ని నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ప్రజాబలంతో 20వేల మేజార్టీతో గెలిచిన తమ పార్టీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ మహిళ విభాగ జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, నాయకులు హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీచర్ ఉద్యోగంలో సక్రమంగా విధులు నిర్వర్తించక విధులు ఎగ్గొట్టి సస్పెండైన గిడ్డి ఈశ్వరిను ఆనాడు వైఎస్సార్‌సీపీ అక్కున చేర్చుకుందన్నారు. కానీ ఎమ్మెల్యేఅయ్యాక తన స్వప్రయోజనాల కోసం కోట్లాది రూపాయాలకు కక్కుర్తి పడి టీడీపీకు అమ్ముడుపోయిన గిడ్డి ఈశ్వరి చరిత్ర ఏమిటో అందరికి తెలుసునన్నారు. ఏనాడు కూడా గిరిజనుల ప్రయోజనాల కోసం ఆమె పని చేయలేదని స్పష్టం చేశారు. తన స్వలాభం కోసం గిరిజనేతరులకు దాసోహమై వారికి తొత్తుగా మారి గిరిజన చట్టాలు, హక్కులను తుంగలోకి తొక్కుతుందన్నారు. 2024 ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరిని నియోజకర్గ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన ఇంకా బుద్ది రాలేదా అని వారు ప్రశ్నించారు.
స్పష్టమైన ప్రకటన తర్వాతే సీఎం పర్యటించాలి
గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీను నేరవేర్చిన తర్వాతే సీఎం చంద్రబాబు పాడేరులో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో నిరుద్యోగుల కోసం షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఇంటింటికీ రేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని, డోలీ మోతలు లేని ఏజెన్సీగా మార్చేందుకు రోడ్డు, రవాణ సౌకర్యాలు కల్పించాలని జీవో నెంబర్–3ను పునరుద్ధరించి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకుండా సీఎం చంద్రబాబు ఏజెన్సీలో పర్యటించే హక్కు లేదని పర్యటనను తామంతా ఏకమై అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అధిక సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు,
నాయకులు పాల్గొన్నారు.