
ఆదివాసీ చట్టాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
రంపచోడవరం:ఆదివాసీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కి, స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు అడవులను, ఖనిజ సంపదను ధారాదత్తం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర నాయకురాలు పీ టాన్యా పిలుపునిచ్చారు. రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఐదు, ఆరు మాడ్యుల్స్ ప్రకారం ఆదివాసీలకు భూమి, అటవీ, ఉద్యోగాలు కల్పించిన నేటి అమలు కావడం లేదన్నారు. ఆదివాసీల హక్కులను, చట్టాలను కాలరాస్తూ దోపిడికి గురి చేస్తూ ప్రశ్నించిన ఆదివాసీలపై ఆపరేషన్ కగర్ పేరుతో హత్యలు చేస్తున్నారన్నారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న ఆదివాసీ చట్టాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఆదివాసీలను అడవీ నుంచి గెంటివేయడానికి నేషనల్ పార్కులు, అభయరణ్యాలు, టూరిస్టు కేంద్రాలు భారీ సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీల జీవించే హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లోని 22 గ్రామాలను నేషన్ పార్క్‌ని నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు లచ్చిరెడ్డి, అశోక్, రమణ తదితరులు పాల్గొన్నారు.