
సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం తగదు
ముంచంగిపుట్టు: సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం తగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మండల పరిషత్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి నిమిత్తం మంజూరు చేసిన నిధులు, ఖర్చులపై సమాచార హక్కు చట్టం ప్రకారంలో ఆర్జీ పెట్టుకుంటే సమాచారం సకాలంలో అందించకపోవడం, కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు పెట్టుకున్న 30రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉండగా రెండు నెలలు తరువాత సమాచారం అందించారన్నారు. తాను అర్జీద్వారా కోరిన సమాచారంలో పలు తప్పులున్నాయని, సుజనకోట పంచాయతీ నిధులు, ఖర్చుల వివరాలు సక్రమంగా అందించలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఎంపీడీవో సూర్యనారాయణమూర్తికి వివరణ కోరగా నీలకంఠం అనే వ్యక్తికి సమాచారం అందించడంలో కొంత అలస్యం అవడం నిజమేనని, పూర్తి స్థాయి సమాచారం అందించి, అతనికి సహకారం అందిస్తామని, సమాచార హక్కు చట్టం అమలులో కచ్చితత్వం పాటిస్తామని ఆయన వివరణ ఇచ్చారు.