
పాఠశాల స్థల దాతలకు న్యాయం చేస్తాం
డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల కోసం భూమి ఇచ్చిన మోసపోయిన భూ బాధితులు ముగ్గురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తు, అదనంగా భూమిని రెవెన్యూ శాఖ ద్వారా సర్వే జరిపి బాధితులకు అప్పగిస్తామని నెస్ట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గౌతమి హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాలను ఆమె శుక్రవారం సందర్శించారు. ప్రిన్సిపాల్ సుమన్‌కుమార్ సింగ్‌ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం పాఠశాల భూదాత బాధితులతో మాట్లాడారు. పాఠశాల నిర్మాణం కోసం భూములిచ్చి ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలకు, వ్యవసాయనికి నోచుకోని బాధితులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అరకులోయలో నిర్మిస్తున్న డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలను త్వరలో డుంబ్రిగుడ తరలించేందుకు సిద్ధం చేస్తున్నమన్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యయని రెండవ ఫ్లోర్ పనులతో పాటు ప్రహరీ నిర్మిస్తున్నామన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిసాల్ సెక్రటరీని కలిసిన వారిలో భూ బాధితులు లైకోన్, డొంబు, రామ్‌చందర్, వైఎస్సార్‌సీపీ నాయకులు తాంగుల రాందాస్, ఏకలవ్య వైస్ ప్రిన్సిపాల్ మురుగేష్ ఉన్నారు.