
నూరుశాతం ఉద్యోగాల జీవో బాధ్యత చంద్రబాబుదే
● అరకు ఎంపీ తనూజరాణి
సాక్షి,పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హమీ మేరకు గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవోను తెచ్చే బాధ్యత అయనదేనని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి అన్నారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ అరకు సభలో సీఎం చంద్రబాబు జీవో నంబరు 3ను పునరుద్ధరించి, గిరిజన అభ్యర్థులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పిస్తానని హమీ ఇచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు గిరిజనులకు న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీ కోసం ఆదివాసీ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనందుకు పాడేరు వస్తున్న చంద్రబాబు జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీపై ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.