మంచం పట్టిన జాజులబంద
కొయ్యూరు: మండలంలోని జాజులబంద గ్రామాన్ని జ్వరాలు చుట్టుముట్టాయి. ఇదే గ్రామంలో ఏడేళ్ల చిన్నారి పాంగి ఇస్తారే కొద్దిరోజుల క్రితం మృతి చెందింది. గ్రామంలో మరికొంతమంది బాధపడుతున్నారు.
మూలపేట పంచాయతీ పరిధిలో గల ఈ గ్రామం డౌనూరు పీహెచ్‌సీకి రావాలంటే దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో స్థానికులు కలుషిత నీటిని తాగడంతో రోగాల బారిన పడుతున్నారు. గెమ్మెలి జీవ, కొర్రా ప్రమీల, మరి కరుణ, మర్రి దేవ తదితర చిన్నారులు జ్వరాలతో బాధపడుతున్నారు. రక్షిత తాగునీరు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు తెలియజేసినా, ఆందోళనకు దిగినా వారు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. వెంటనే రహదారి నిర్మించి, రక్షిత నీటిని అందజేయాలని వారు కోరుతున్నారు.
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
సమాచారం తెలుసుకున్న వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డౌనూరు వైద్యాధికారి లలిత తెలిపారు. రక్త పరీక్షల్లో ఎవరికి పాజిటివ్ రాలేదన్నారు.ఆస్పత్రిలోను చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఇస్తారే కడుపునొప్పితో మృతి చెందినట్టు ఆమె తెలిపారు. మిగతా చిన్నారులకు వైద్యం అందిస్తున్నామని ఆమె వివరించారు.
జ్వరాలతో పలువురికి అస్వస్థత
ఏడేళ్ల చిన్నారి మృతి
వైద్య శిబిరం ఏర్పాటు
మంచం పట్టిన జాజులబంద


