
2వ ఆప్షన్‌పై నిర్వాసితుల అభ్యంతరం
కూనవరం: పోలవరం నిర్వాసితుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్ అవగాన సమావేశం అర్ధంతరంగా ముగిసింది. నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇచ్చిన అఫిడవిట్‌లో 2వ ఆప్షన్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంటినిర్మాణ వ్యయం కేవలం రూ.2,85,000 గా నిర్ణయించడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ సొమ్ముతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేయాలని కోరతామని తెలిపారు. గిరిజనుల మాదిరిగానే తమ కూడా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజనేతరులు కోరారు. లేదా ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈవిషయంపై చింతూరు ఐటీడీఏ పీవోను కలిసి తమ సమస్యను తెలిపిన తరువాతే అఫిడివిట్‌లో సంతకాలు చేస్తామని, అప్పటి వరకు సంతకాలు చేసేదిలేదని స్పష్టం చేశారు. అంతేగాక తమకు కేటాయించనున్న పునరావాస కాలనీ స్థలాలను స్వయంగా చూడాలని, అప్పుడే తమ అభిప్రాయం వెల్లడిస్తామని నిర్వాసితులు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, వీఆర్‌వో వెంకన్న, సర్పంచ్ మల్లంపల్లి హేమంత్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.