
నీళ్ల ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ముంచంగిపుట్టు: నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ బిరిగూడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగంవలసకు చెందిన అల్లంగి బిమేష్(21) శుక్రవారం బిరిగూడ వంతెన పనుల నిమిత్తం నీటిని ట్యాంకర్‌తో తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో ట్యాంకర్ బ్రేకులు ఫెయిలై ఒక్కసారిగా బోల్తా పడింది. ట్యాంకర్ కింద డ్రైవర్ బిమేష్ పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే బిమేష్ ట్యాంకర్ కింద నలిగిపోయి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానిక సర్పంచ్ త్రినాథ్, వైఎస్సార్‌సీపీ మండల నేత సాధురాం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇటీవలే బిమేష్‌కు పెళ్లి అయింది. ఇంతలోనే ప్రమాదంలో చనిపోవడంతో సంగంవలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడి భార్య దొయిమెత్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.