
డీఎన్‌ఎఫ్ ద్వారా అభివృద్ధికి బాటలు
నీతి ఆయోగ్ నివేదికలో ప్రశంస
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ప్రారంభించిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమానికి ఎంపికైన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు సహకార ఆధారిత అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా మారింది. ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛంద సంస్థలు వేర్వేరుగా పని చేస్తూ.. పరిమిత ఫలితాలు మాత్రమే సాధించాయి. దీనిని అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డి్రస్టిక్ట్ నాన్ ప్రాఫిట్ ఫోరం(డీఎన్‌ఎఫ్) కీలక మార్పులు తెచ్చిందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది.
ఒకే వేదికపై స్వచ్ఛంద సంస్థలు..
జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం, గ్రామ పంచాయతీలు డీఎన్‌ఎఫ్ ద్వారా ఒకే దారిలో పయనించాయి. దీంతో ప్రణాళికలు సక్రమంగా అమలవ్వడంతో పాటు సత్ఫలితాలు గ్రామస్థాయికి చేరాయి. గిరిజనులకు కాఫీ ఆధారిత జీవనోపాధి బలపడింది. గ్రామాల్లో తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు మెరుగయ్యాయి. అదనంగా.. ఐదు గ్రామాల్లో సుస్థిర వ్యవసాయ పద్ధతుల పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసి రైతులకు కొత్త మార్గాలను చూపించారు. యువత, సివిల్ సొసైటీ భాగస్వామ్యం పెరిగి పంచాయతీల స్థాయిలో నిర్ణయాలు బలపడ్డాయి.
సంఘటిత వేదిక లేకుండా అభివృద్ధి కష్టమని అల్లూరి జిల్లా ద్వారా స్పష్టమైందని నీతి ఆయోగ్ పేర్కొంది. డేటా ఆధారిత నిర్ణయాలు, పారదర్శక సమీక్షలు విశ్వసనీయతను తెచ్చాయని ప్రశంసించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా మంచి ఫలితాలను ఇచి్చందని పేర్కొంది. అభివృద్ధిలో సమన్వయం, సహకారం, సమగ్రత అనే సూత్రాలతో ముందుకు సాగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అభినందించింది.