గర్భిణిని గెడ్డ దాటించి ఆస్పత్రికి తరలింపు
డుంబ్రిగుడ: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని కోసంగి గ్రామానికి చెందిన వంతల అఖిల బుధవారం ఉదయం నుంచి పురిటినొప్పులతో బాధపడుతోంది. ఈ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు, వంతెన సౌకర్యం లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. 108 అంబులెన్సు గ్రామానికి వచ్చే అవకాశం లేకపోవడంతో సర్పంచ్ వంతల వెంకటరావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు గర్భిణిని గెడ్డను దాటించి ఆస్పత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం స్పందించి గ్రామానికి రోడ్డు, వంతెన మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు.


