ప్రజల భద్రతకు కొత్త దిక్సూచి
● హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌసుల్లో అతిథుల వివరాల నమోదు ● నేర చరితులు, అనుమానితులుంటే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ● ప్రస్తుతం జిల్లాలో 79 చోట్ల యాప్ డౌన్‌లోడ్ ● దశలవారీగా పర్యాటక కేంద్రాల్లోనూ అందుబాటులోకి..
ఇలా చేస్తారు.
సందర్శకుల వివరాలను ఆధార్ కార్డు ద్వారా ‘సేఫ్ స్టే’ మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. వారిలో నిందితులు ఎవరైనా ఉన్నట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పూర్తి వివరాలు తెలుస్తాయి. తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. అక్కడకు పోలీసులు వెళ్లి అనుమానితుల పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇది నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి దశగా జిల్లాలో 79 హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. దశలవారీగా మిగిలిన చిన్నచిన్న హోటళ్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పోలీస్ శాఖ చెబుతోంది.
అనకాపల్లి: అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన నిఘా ద్వారా పౌరులను రక్షించడానికి అనకాపల్లి పోలీసులు ‘సేఫ్ స్టే’ యాప్‌ను ప్రారంభించారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలలో బస చేసే అతిథుల వివరాలను.. క్రిమినల్ వివరాల డేటాబేస్‌తో సరిపోల్చి నేరస్తులను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లాడ్జీలు, హోటళ్లలో ఈ యాప్‌ను పొందుపరిచారు. అక్కడ ఎవరు చెక్ ఇన్ చేసినా వారి వివరాలను ఈ ఆన్‌లైన్ యాప్‌లో పొందుపరిచి వెంటనే పోలీసులకు పంపిస్తారు. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులెవరైనా ఉంటే తక్షణమే పోలీసులు సులభంగా వారిని అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది.
ఈనెల 8 నుంచి అమల్లోకి..
నేరస్తులను నిలువరించేందుకు సాధారణంగా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమానముంటే అదుపులోకి తీసుకుంటారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతంలో స్టే చేసే వారి వివరాలను సైతం విశ్లేషిస్తే అనుమానితులను ముందే కట్టడి చేయవచ్చు.. లేదా నేరం జరిగాక త్వరగా నిందితులను గుర్తించవచ్చు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే సేఫ్ స్టే యాప్. ఈనెల 8న జిల్లా పోలీస్ శాఖ ఈ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను జిల్లాలోని ప్రధానమైన హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌసుల్లో డౌన్‌లోడ్ చేయించారు. మిగతావారు కూడా ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజల భద్రత మరింత పటిష్టం చేసేందుకే..
‘సేఫ్ స్టే‘ యాప్ ద్వారా నేరస్తులను ముందుగానే గుర్తించవచ్చు. నేరాలను తగ్గించవచ్చు. ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించడానికి వీలుంటుంది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుంది. దశలవారీగా జిల్లాలో యాప్ డౌన్‌లోడ్ చేయిస్తాం. త్వరలో రెండో దశలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – తుహిన్ సిన్హా, ఎస్పీ
‘సేఫ్ స్టే‘ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన అనకాపల్లి జిల్లా పోలీసులు
ప్రజల భద్రతకు కొత్త దిక్సూచి


