స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అరకులోయలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. అరకులోయ పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్ సీపీకి, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించనున్నట్టు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. అంతకుముందు పరిశీలకుడి హోదాలో మొదటి సారి అరకులోయ వచ్చిన బొడ్డేడ ప్రసాద్‌కు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దుశ్శాలువాతో సత్కరించి, స్వాగతం పలికారు. అనంతరం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగంను పరిశీలకుడు ప్రసాద్ సన్మానించారు. ఈకార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చాటరీ జానికమ్మ, డుంబ్రిగుడ, అనంతగిరి ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాకా ఈశ్వరి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు పాంగి చిన్నరావు, నియోజవర్గం ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అరకులోయ పార్లమెంట్
నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి


