మాజీ మంత్రి రజినిపై సీఐ తీరు సరికాదు
కూనవరం: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తుందని, మహిళలను సైతం విడిచిపెట్టడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల మరియాదాస్ మండిపడ్డారు. చిలకలూరి పేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని మర్చిపోయి పోలీస్ జులుం చూపిస్తూ మాజీ మంత్రి, బీసీ మహిళ విడదల రజినిపై ప్రవర్తించిన తీరును నిరసిస్తూ టేకులబోరు సెంటర్‌లో సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి, అనేక విధాలుగా వేధిస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులుపెట్టి, చిత్రహింసలకు గురిచేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, సర్పంచ్‌లు కారం పార్వతి, సున్నం అభిరాం, కట్టం లక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు డి.గంగాధర్, భరతమూర్తి, కొండలరావు, వెంకన్న, సత్యనారాయణ, మధు, పాపారావు, లక్ష్మణరావు, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.


