దార్రెల మహిళల ఔదార్యం
ముంచంగిపుట్టు: వేసవిలో మండుటెండలో పయనించే బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఆ గ్రామ మహిళలు తమ వంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. తమ సొంత నిధులతో మజ్జిగ, నిమ్మరసం అందించి ఔదార్యం చాటుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో కిలగాడ జంక్షన్ వద్ద ప్రయాణికులకు వేసవి కాలం నాలుగు నెలల పాటు చల్లటి మజ్జిగ, నిమ్మరసం ఉచితంగా అందిస్తున్నారు. దార్రెల పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన మహిళలు. ప్రతి శనివారం 30 మంది స్థానిక గిరిజన మహిళలు సొంత డబ్బులతో మజ్జిగ, నిమ్మరసం తయారు చేసుకుని కిలగాడ జంక్షన్ వద్ద సిద్ధంగా ఉంటున్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు నుంచి వచ్చే బస్సులు, ఆటోలు, జీపులు, ద్విచక్రవాహనాలను ఆపి మజ్జిగ, నిమ్మరసాన్ని ఉచితంగా అందిస్తూ ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. దార్రెల మహిళలు చేస్తున్న సేవలపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా మహిళలను ఎస్‌ఐ రామకృష్ణ అభినందించారు. శనివారం రోజు ముంచంగిపుట్టు వారపు సంత కావడం ఆ రోజు అధిక శాతం మంది ప్రయాణికులు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ మేరకు ప్రయాణికుల దాహం తీర్చాలనే ఉద్దేశంతో చందా రూపంలో డబ్బులు వేసుకొని, ప్రతి ఏడాది వేసవిలో తమ వంతు సేవా కార్యక్రమం చేస్తున్నామని దార్రెల గ్రామానికి చెందిన మహిళలు శాంతమ్మ, రత్నమ్మ, నీలమ్మ, పుష్పవతి, లక్ష్మీ, శ్రీదేవి, మచ్చులమ్మ, వెంకటలక్ష్మి, మీనాక్షి, దుర్గాదేవి,విజయలక్ష్మి, తిరుమలమ్మ, నీలమలు తెలిపారు.
బాటసారుల దాహార్తి తీరుస్తున్న
స్థానికులు
ఉచితంగా మజ్జిగ, నిమ్మరసం అందజేత
దార్రెల మహిళల ఔదార్యం


