ఉద్యాన పంటల సాగుతో రైతులకు రెట్టింపు ఆదాయం
చింతపల్లి: గిరిజన రైతులు వ్యవసాయ పంటలకు దీటుగా ఉద్యాన పంటలను సాగుచేయడం వల్ల మంచి ఆదాయం పొందవచ్చని చింతపల్లి మండల ఉద్యాన అధికారి కంటా బాలకర్ణ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఆర్‌ఏఆర్‌ఎస్ మార్టేరు, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో శనివారం చింతపల్లి మండలం రాజుపాకలు వద్ద రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయన్నారు. ఈ భూముల్లో సేంద్రియ విధానంలో అన్ని రకాల పంటలను పండించడంతో పాటు సుస్థిర సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరించాలని కోరారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ విధానాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పెదబరడ మాజీ సర్పంచ్ బోయిన సత్యనారాయణ, లంబసింగి ఆర్గానిక్ ఎఫ్‌ఫీఓ డైరెక్టర్లు సరోజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు.


