
గిరిజనులకు తప్పని డోలీ మోత కష్టాలు
ముంచంగిపుట్టు: జిల్లాలో మారుమూల గ్రామాల గిరిజనులకు డోలీమోత కష్టాలు తప్పడం లేదు. ముంచంగిపుట్టు మండలం గొబ్బరపాడలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులను, జి.మాడుగుల మండలం జాములవీధిలో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆయా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డోలీమోతతో ఆస్పత్రులకు తరలించారు. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరపాడ గ్రామంలో ఐదుగురు గిరిజనులు అనారోగ్యం బారిన పడి మంచం పట్టారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు డోలీ మోతతో, రహదారి ఉన్న రంగబయలు గ్రామం వరకు మూడు కిలో మీటర్లు మోసుకు వచ్చారు.అనంతరం ప్రైవేట్ వాహనంలో లబ్బూరు పీహెచ్‌సీ తరలించారు.గొబ్బరపాడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ గిరిజనులు కోరారు.
అనారోగ్య సమస్యతో ఆత్మహత్యాయత్నం
జి.మాడుగుల: మండలంలో బొయితిలి పంచాయతీ జాములవీధి గ్రామానికి చెందిన లొంబోరి రవన్నబాబు కొన్నాళ్లుగా జ్వరం, కడునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం విషం తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన డోలీమోతతో మూడు కిలోమీటర్ల దూరంలోగల సూరిమెట్ట గ్రామానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అందరూ పండగ సందడిలో ఉండగా రవన్నబాబు ఆత్మహత్మకు యత్నించినట్టు గ్రామస్తులు చెప్పారు. రవన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వారు తెలిపారు.

గిరిజనులకు తప్పని డోలీ మోత కష్టాలు