
ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు
కూనవరం: స్థానిక సీహెచ్‌సీ వైద్యులు సకాలంలో స్పందించడంతో గుండెపోటుతో వచ్చిన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడిన సంఘటన మండల పరిధిలోని కోతులగుట్ట సీహెచ్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఆస్పతి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన నిరుపేద ముత్యాల వెంకటరమణ శనివారం అస్వస్థతకు గురికావడంతో కూనవరం మండల పరిధిలోని కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చారు. ఆస్పత్రికి వచ్చిన ఆయనకు చాతినొప్పి, ఒల్లంతా చెమటలు రావడంతో వైద్యాధికారులు, సిబ్బంది వెంటనే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షతో అతనికి గుండె నొప్పి వచ్చినట్టు గుర్తించారు. వైద్యులు మహేష్‌బాబు, తేజలు తక్షణమే స్పందించి, రోగికి ఆస్పత్రిలో అందుబాటులో రూ.40 వేలు విలువైన టెనెక్టోప్లస్ ఇంజక్షన్ అందజేశారు. దీంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ మహేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం ముత్యాల వెంకటనారాయణను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎవరికై నా గుండె సంబంధిత సమస్యలు ఉంటే కోతులగుట్ట ఆస్పత్రికి రావొచ్చని, మెరుగైన వైద్యం అందిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు చెప్పారు.
గుండెపోటు రోగికి టెనెక్టోప్లస్ ఇంజక్షన్