భూ కబ్జాపై బాధితుల ఫిర్యాదు
అనంతగిరి(అరకులోయటౌన్): మండలంలోని భీంపోల్ పంచాయతీ సరియాపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 69/5లో సుమారు 1.50 ఎకరాలకు చెందిన తమ భూమిని గిరిజనేతరుడైన బి.నగేష్ కబ్జా చేసి చదును చేస్తున్నట్టు బాధితురాలు మామిడి రాధమ్మ, ఆమె కుమారుడు అప్పలకొండ అనంతగిరి ఇన్‌చార్జి తహసీల్దార్ మాణిక్యం, ఎస్‌ఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్టు ఒక ప్రకటనలో వారు తెలిపారు. తాము గ్రామంలో లేని సమయంలో గిరిజనేతరుడు బి.నగేష్‌తోపాటు అతని అనుచరులు తమ స్థలంలో జేసీబీలతో ఇనుప కంచెలు తొలగించి, అరటి తోటలు ధ్వంసం చేసి, భూమి చదును చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు. తమకు వంశపారపర్యంగా సంక్రమించిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించేదుకు పూనుకున్నారన్నారు. తమ భూమిని కబ్జా చేసిన గిరిజనేతరుడు నగేష్‌తోపాటు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోని, తమ భూమికి రక్షణ కల్పించాలని ఇన్‌చార్జి తహసీల్దార్, ఎస్‌ఐలకు కోరామన్నారు. సదరు గిరిజనేతరుడు నగేష్ అనే వ్యక్తి టీడీపీ సానుభూతి పరుడిగా చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మాణిక్యంకు వివరణ కోరగా మామిడి రాధమ్మ, ఆమె కుమారుడు అప్పలకొండ తమ భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌తో కలిసి సోమవారం సరియాపల్లి గ్రామానికి వెళ్లి విచారణ జరుపుతామని మాణిక్యం తెలిపారు.
ఆక్రమణకు పాల్పడిన గిరిజనేతరుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్


