
గంజాయి వినియోగంతో సమాజానికి చేటు
సాక్షి,పాడేరు: గంజాయి వినియోగంతో సమాజానికి చేటు అని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలు శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు.గంజాయి సాగు చేసే రైతులు, రవాణాదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సాగు విడిచిపెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, బ్యాంకుల రుణాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. 15వేల ఎకరాల్లో నీడతోటలు, పండ్ల మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు.
గంజాయి సాగు, రవాణా చేస్తే స్థిరచరాస్తుల జప్తు
జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా చేసినా వారి స్థిర, చరాస్తులు జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గంజాయి స్మగ్లర్లను గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా 221 గ్రామాల్లో గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఒక్క మార్చి నెలలోనే 782 కిలోల గంజాయిని పట్టుకుని 9మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు గంజాయి నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లును విడుదల చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, పాడేరు, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌లు సౌర్యమన్ పటేల్, కల్పశ్రీ, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు నందు, రమేష్‌కుమార్‌రావు, డీఈవో బ్రహ్మజీరావు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్