
లభ్యంకాని యువకుల ఆచూకీ
చింతూరు: మండలంలోని కల్లేరు వద్ద సీలేరు నదిలో గల్లంతైన యువకుల ఆచూకీ సోమవారం కూడా లభ్యంకాలేదు. ఆదివారం సరదాగా గడిపేందుకు సీలేరు నదికి వెళ్లిన ఆరుగురు యువకుల్లో నాగుల దిలీప్‌కుమార్(25), సుగ్రియ శ్రీను(25) నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఎస్డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు డ్రోన్, స్పీడ్‌బోట్, వలల సాయంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా యువకుల జాడ కానరాలేదు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా నదివద్ద గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నది లోతుగా ఉండడంతో పాటు, నీరు అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సోమవారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యంకాలేదని, రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని, తిరిగి మంగళవారం ఉదయం నుంచి గాలింపు చేపడతామని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

లభ్యంకాని యువకుల ఆచూకీ