
పాత గంగవరం తీరంలో విద్యార్థి గల్లంతు
పెదగంట్యాడ: పాత గంగవరం తీరంలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. శ్రీనగర్, గాజువాక చైతన్య టెక్నో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, గాజువాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులు. వీరందరూ కలసి మూడు సైకిళ్లపై గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో పాత గంగవరం తీరానికి వెళ్లారు. అందరూ కలసి సముద్రంలో స్నానం చేసిన తర్వాత బయట వచ్చి ఇసుకలో ఆటలాడుతుండగా.. అందులో రోహిత్, భరత్, తనూష్ మళ్లీ సముద్రంలోకి వెళ్లారు. సరదాగా గడుపుతుండగా కెరటాల ఉధృతికి నడుపూరుకు చెందిన ఒనుం తనూష్(15) సముద్రంలోకి కొట్టుకొనిపోయాడు. విద్యార్థిని రక్షించేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న గాజువాక ఏసీపీ త్రినాథ్, న్యూపోర్టు పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. విద్యార్థి ఆచూకీ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. తనూష్ తండ్రి మంగరాజు ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.