● యోగాసనాలు సూర్యనమస్కారాలు చేసిన కలెక్టర్ దంపతులు ● బొజ్జన్నకొండ వద్ద సైకిల్ ర్యాలీ
అనకాపల్లి టౌన్: జిల్లా కలెక్టర్లు వారు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదా వారిది. ఒకరిది అనకాపల్లి జిల్లా అయితే.. ఇంకొకరిది అల్లూరి జిల్లా. వారిద్దరు విజయకృష్ణన్.. దినేష్ కుమార్ దంపతులు. నిరంతరం అధికారులు, ప్రజలతో బిజీగా, క్షణం తీరిక లేకుండా వారి జీవన శైలి ఉంటుంది.అయితే అందుకు భిన్నంగా ఆదివారం ఆటవిడుపుగా కొంత సేపు సైక్లింగ్ చేశారు. అలాగే సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా పేరొందిన బొజ్జన్న కొండ ఆవరణలో కలెక్టర్ దంపతులు యోగాసనాలు వేశారు. స్థానికులతో ఫొటోలు దిగారు.
ఫిట్‌నెస్ కోసం యోగా, సైక్లింగ్
మనిషి దైనందిన జీవితంలో యోగా అతి ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం రోజు కనీసం ఒక గంట యోగా, సైక్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. యోగా లైఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఐదు కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. తుమ్మపాల నుంచి ప్రారంభమైన ర్యాలీ అనకాపల్లి నాలుగురోడ్ల జంక్షన్, సూర్యనారాయణ ఆలయం మీదుగా బొజ్జన్న కొండకు చేరుకుంది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ కూడా పాల్గొని సైక్లింగ్ చేశారు. ర్యాలీ అనంతరం బొజ్జన్న కొండకు చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ మనిషికి ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని, దీనివల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. ర్యాలీలో డాక్టర్ శ్రీరామమూర్తి, యోగా లైఫ్ ఫౌండర్ బాబూరావు, ట్రైనర్స్ దేవికా, రమాదేవి, మణికంఠ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఆరోగ్యమస్తు..
ఆరోగ్యమస్తు..


