పార్టీలో ఎంజాయ్‌ చేస్తూస్నేహితుడే నీటిలోకి తోసేశాడు

- - Sakshi

అచ్యుతాపురం(అనకాపల్లి): మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తోటి స్నేహితుని మరణానికి కారణమయ్యాడు మరో స్నేహితుడు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండకర్లలోని ఒక ప్రైవేట్‌ రిసార్ట్‌లో శనివారం రాత్రి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి విజయనగరానికి చెందిన సాయివర్మ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్నేహితులు కొండకర్లలో ప్రైవేట్‌ రిసార్టులో శనివారం సందడి చేశారు.

స్నేహితుల్లో కొందరు మద్యం సేవించి స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నృత్యాలు చేశారు. ఆ సమయంలో సాయివర్మను మరో స్నేహితుడు సిమ్మింగ్‌ పూల్‌లోకి తోసేశాడు. నీటిలో పడిపోయిన సాయివర్మకు ఈత రాకపోవడమో లేక మద్యం మత్తు కారణమో గానీ కొంత సేపటికి స్విమ్మింగ్‌ పూల్‌లో తేలిపోయాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సాయివర్మను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో మునిగి చనిపోయాడని భావించినప్పటికీ సీసీ ఫుటేజ్‌ దృశ్యాలను చూసిన తర్వాత పోలీసులు ఘటనకు కారణాన్ని గుర్తించారు.

పార్టీలో ఎంజాయ్‌ చేస్తూ స్నేహితుడే సాయివర్మను నీటిలోకి తోసేసినట్టు గుర్తించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటన కాదని భావించిన పోలీసులు సాయంత్రం తర్వాత కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడి రిసార్ట్‌లో గతంలోనూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకొన్న తర్వాత ఒక వ్యక్తి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి చనిపోయాడు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి సీసీ ఫుటేజ్‌లు లేకపోవడంతో కేసు తీవ్రత గుర్తించలేకపోయారు. తాజా ఘటనతో కొండకర్ల పరిసరాల్లో జరిగే పార్టీలపై నిఘా పెట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.
 

Read also in:
Back to Top