breaking news
private resort
-
మద్యం మత్తు.. సిమ్మింగ్ పూల్‌లో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం(అనకాపల్లి): మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తోటి స్నేహితుని మరణానికి కారణమయ్యాడు మరో స్నేహితుడు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండకర్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌లో పడి విజయనగరానికి చెందిన సాయివర్మ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్నేహితులు కొండకర్లలో ప్రైవేట్ రిసార్టులో శనివారం సందడి చేశారు. స్నేహితుల్లో కొందరు మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్ వద్ద నృత్యాలు చేశారు. ఆ సమయంలో సాయివర్మను మరో స్నేహితుడు సిమ్మింగ్ పూల్‌లోకి తోసేశాడు. నీటిలో పడిపోయిన సాయివర్మకు ఈత రాకపోవడమో లేక మద్యం మత్తు కారణమో గానీ కొంత సేపటికి స్విమ్మింగ్ పూల్‌లో తేలిపోయాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సాయివర్మను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో మునిగి చనిపోయాడని భావించినప్పటికీ సీసీ ఫుటేజ్ దృశ్యాలను చూసిన తర్వాత పోలీసులు ఘటనకు కారణాన్ని గుర్తించారు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ స్నేహితుడే సాయివర్మను నీటిలోకి తోసేసినట్టు గుర్తించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటన కాదని భావించిన పోలీసులు సాయంత్రం తర్వాత కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడి రిసార్ట్‌లో గతంలోనూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకొన్న తర్వాత ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి సీసీ ఫుటేజ్‌లు లేకపోవడంతో కేసు తీవ్రత గుర్తించలేకపోయారు. తాజా ఘటనతో కొండకర్ల పరిసరాల్లో జరిగే పార్టీలపై నిఘా పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
జేడీఎల్పీ నేతగా కొనసాగుతా
సాక్షి, బెంగళూరు : తన రాజీనామా నిర్ణయంపై జేడీఎల్పీ నేత కుమారస్వామి వెనక్కు తగ్గారు. విపక్ష నేతగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పారు. లోకసభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి నైతకి బాధ్యత వహిస్తూ జెడీఎల్సీ నేత స్థానానికి, పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఓ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇటీవల జేడీఎస్ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయని అన్నారు. కుటుంబ పార్టీగా జేడీఎస్‌పై ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించానని అన్నారు. అయితే సమావేశంలో మెజారిటీ సభ్యుల కోరిక మేరకు జెడీఎల్పీ నేతగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విపక్ష విప్ స్థానానికి ఇతరులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం లోపు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. పార్టీలోని నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిస్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సమావేశానికి మాగడి నియోజక వర్గ ఎమ్మెల్యే హెచ్.సి బాలకృష్ణతోపాటు బసవకళ్యాణ శాసనసభ సభ్యుడు మల్లికార్జున ఖుబా డుమ్మాకొట్టారు. వీరిలో సీబీఐ దర్యాప్తునకు భయపడి బాలకృష్ణ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. మల్లికార్జున ఖుబా బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడకు రాజీనామా పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తమ రాజీనామాను స్పీకర్ ద్వారా ఆమోదింపజేసుకుంటే శాసనసభలో జేడీఎస్ బలం 40 నుంచి 39 పడిపోవడమే కాకుండా ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదాను కోల్పోనుంది. జేడీఎస్‌ను వీడను : జమీర్‌అహ్మద్ తాను జేడీఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్‌ఖాన్ కొట్టిపారేశారు. హజ్ యాత్రలో ఉండటం వల్లే లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో పాల్గొనలేదన్నారు. ఇందుకు మీడియా విపరీతార్థాలు తీసిందని అసహనం వ్యక్తం చేశారు. కుమారస్వామితో తన స్నేహం విడదీయనిదని తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జేడీఎస్‌పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.