తుమ్మపాల : బొజ్జన్నకొండను అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేసి జిల్లాలో టూరిజం అభివృద్ధితో పాటు పారిశ్రామిక జిల్లాగా చేసేందుకు సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. మండలంలో శంకరం గ్రామంలో గల బొజ్జన్నకొండ వద్ద ఎంపీ బి.వి.సత్యవతి ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బెల్లానికి గుర్తింపుగా ఉన్న అనకాపల్లి, ఇక నుంచి బొజ్జన్నకొండ ద్వారా పర్యాటకానికి కేరాఫ్‌గా మారనుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బొజ్జన్నకొండ అభివృద్ధికి రూ.7.3 కోట్ల నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయన్నారు. కేంద్ర నిధుల మంజూరులో ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి ఎంపీ బి.వి.సత్యవతి ఎనలేని కృషి చేశారని అభినందనలు తెలిపారు. జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతుందన్నారు.రాష్ట్రంతో పాటు, జిల్లాను మరింత అభివృద్ధి చేసుకునేందుకు అందరం కలిసి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ మన ప్రాంతానికే తలమానికంగా ఉన్న బొజ్జన్నకొండ అభివృద్ధికి ఎంపీ విశేష కృషి చేశారన్నారు. వై.వి.సుబ్బారెడ్డి చొరవతో రూ.3 కోట్లతో అనకాపల్లిలో టీటీడీ కళ్యాణమండపం, టికెట్ కౌంటర్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ఎంపీ సత్యవతి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో చర్చించి నిధులు మంజూరుతో పాటు పనులు ప్రారంభానికి విశేష కృషి చేశారన్నారు. ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.7.3 కోట్ల నిధులలో రూ.2.5 కోట్లతో భవనాలు నిర్మాణానికి కేటాయించినప్పటికి అర్కియాలజి శాఖ నిబంధనల ప్రకారం బొజ్జన్నకొండ పరిసరాలలో అనుమతులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్థల సేకరణ చేశామన్నారు. విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయిస్తూ వెంటనే మంజూరు చేయడంతో ఈ రోజున వై.వి.సుబ్బారెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేసి పనులు ప్రారంభించడం శుభపరిణామన్నారు. ఇక్కడ లైటింగ్‌తో పాటు, బౌద్ధ చరిత్ర, టాయిలెట్, సీసీ కెమెరా, బుద్దుని జ్ఞాన మందిరం, రెస్టారెంట్, హైవేలో ముఖద్వారంలా శిలాతోరణం ఏర్పాటు చేస్తామన్నారు.
అనకాపల్లి అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక చొరవ
వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి
రూ.7.3 కోట్లతో బొజ్జన్నకొండ అభివృద్ధి పనులకు భూమిపూజ


