పక్కాగా ప్రైవేటు స్కూళ్ల లెక్క..! | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ప్రైవేటు స్కూళ్ల లెక్క..!

Sep 25 2023 1:44 AM | Updated on Sep 25 2023 1:44 AM

ప్రైవేటు యాజమాన్యాలకు ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతున్న ఆర్జేడీ జ్యోతి కుమారి - Sakshi

ప్రైవేటు యాజమాన్యాలకు ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతున్న ఆర్జేడీ జ్యోతి కుమారి

● ఆన్‌లైన్‌లో సమగ్ర వివరాలు నమోదు చేయాల్సిందే.. ● గుర్తింపు, రెన్యువల్‌కు ప్రత్యేకంగా ‘స్కూల్‌ మానిటరింగ్‌ యాప్‌’ ● నిబంధనలు పాటిస్తేనే నిర్వహణకు అనుమతులు ● ప్రైవేటు స్కూళ్లలో అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట ● స్కూళ్లు యాజమాన్యాలకు అవగాహన సదస్సులు

నగరంలోని ఎన్‌ఏడీ సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యం సీబీఎస్‌సీ చదువుల పేరుతో ఆర్భాటపు ప్రచారం చేసి, విద్యార్థులను చేర్చుకున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేశారు. కానీ ఆ పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి పొందిన గుర్తింపు గడువు ముగిసింది. 2023–24 విద్యా సంవత్సరానికి రెన్యువల్‌ లేకుండానే అడ్మిషన్లు చేపట్టిన విషయం తనిఖీలకు వెళ్లిన విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఎందుకిలా చేశారని ఆ పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచిలను నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్‌ పాఠశాలకు నగరంలోని మూడు బ్రాంచిలకు ప్రభుత్వ పరంగా గుర్తింపు రెన్యువల్‌ ఇవ్వలేదు. పాఠశాల నిర్వహిస్తున్న భవనానికి తగిన ధృవీకరణ పత్రాలు సమర్పించలేదనే కారణంతో వారికి విద్యాశాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ 2023–24 విద్యా సంవత్సరానికి ఆ పాఠశాల యాజమాన్యం దర్జాగానే విద్యార్థులను చేర్చుకొని, ఇష్టానుసారం ఫీజుల వసూలు చేసేసింది.

విశాఖ విద్య: దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో ఇబ్బడిముబ్బడిగా విద్యాలయాలు వెలుస్తున్నాయి. కానీ సరైన వసతులు, అర్హత గల ఫ్యాకల్టీ, ప్రభత్వ పరంగా తగిన అనుమతులు లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తూ, విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కాలేజీ ఎడ్యుకేషన్‌, ఉన్నత విద్యా శాఖల్లో అమలు చేస్తున్న విధంగానే ప్రైవేటు పాఠశాలల సమస్త సమాచారాన్ని డిజిలైజేషన్‌ చేసేందుకు నిర్ణయించింది. ఒక్క క్లిక్‌తో ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా పాఠశాలల సమగ్ర వివరాలు తెలుసుకునేలా పక్కా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వివరాలు నమోదుకు ప్రత్యేక యాప్‌

విద్యాశాఖ రూపొందించిన ‘స్కూల్‌ మానిటరింగ్‌ యాప్‌’లో ప్రైవేటు స్కూళ్లు సమస్త సమాచారం నమోదు చేయాలి. సొసైటీల ద్వారా నిర్వహిస్తున్నట్లయితే, అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. ఫైర్‌ సేఫ్టీ, పొల్యూషన్‌ ధ్రువపత్రాలతో పాటు, పోలీసు శాఖ నుంచి కూడా అనుమతి తీసుకొని ఆ పత్రాలను యాప్‌లో నమోదు చేయాలి. స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి అర్హత సర్టిఫికెట్లు కూడా పొందుపరచాలి. విద్యాశాఖ నుంచి కేటాయించిన యు–డైస్‌ కోడ్‌ ద్వారానే భవిష్యత్‌లో పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవాలి. దీని వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగానే ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా ..? లేదా..? పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏ మేరకు అర్హతలు ఉన్నాయి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకే ఫీజులు కూడా వసూలు చేయాలి.

యాజమాన్యాలకు అవగాహన

2023–24 విద్యా సంవత్సరం నుంచే నూతన విధానం ద్వారా ప్రైవేటు స్కూళ్లకు గుర్తింపు, రెన్యువల్‌ ధ్రువపత్రాలను జారీ చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాకు పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ జ్యోతి కుమారి ఇటీవల ప్రైవేటు యాజమాన్యాలకు సదస్సు ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పాఠశాలలకు అనుమతులు పొందే విధంగా ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు సమాచారం అంతా ఆన్‌లైన్‌ చేయాలనేది మంచి నిర్ణయమే అయినప్పటకీ, దీనికి కొంత గడువు ఇవ్వాలని స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్‌ (ఏపీపీయుఎస్‌ఎంఏ) జిల్లా అధ్యక్షుడు ఎంవీ రావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement