
ముదపాక భూములు
దొంగే దొంగ అన్నట్టు ఉంది తెలుగుదేశం నేతల వ్యవహారం. టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో భారీగా భూములను కబ్జా చేసి.. భూ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేసిన ఆ పార్టీ నేతలు ఓ వెలుగు వెలిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల భూ కబ్జాలను ఎండగడుతూ వేల కోట్ల విలువైన భూములను తిరిగి ప్రభుత్వ భూ బ్యాంకులోకి చేర్చింది. గతంలో జరిగిన తప్పుడు సర్వేలను సరిచేస్తూ.. అర్హులకు న్యాయం చేసేలా ముందుకు సాగుతోంది. గత ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నేతలు భూకబ్జాలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలతో కొంత మేర లబ్ధి పొందిన టీడీపీ.. ఇప్పుడు ఎన్నికల ముందు అదే పంథాను అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ నేతల భూదందాపై ‘సాక్షి’ వరుస కథనాలు అందించాలని నిర్ణయించింది. మొదటగా ముదపాక భూముల వ్యవహారంలో తప్పుడు జియోకాన్ సర్వేతో టీడీపీ నేతలు ఏ విధంగా చక్రం తిప్పారో ఇప్పుడు చూద్దాం.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
● ముదపాక భూములను కొట్టేసేందుకు గత ప్రభుత్వం పన్నాగం
● టీడీపీ కార్యకర్తలు, నాయకులు పేర్లను సర్వేలో చేర్చిన వైనం
● అప్పటి ఎమ్మెల్యే బండారు కనుసన్నల్లోనే జియోకాన్ సర్వే
● ఇప్పటికీ ఆ భూములను కొల్లగొట్టేందుకు యత్నాలు
● అందుకే జగనన్న కాలనీలకు అడ్డు తగులుతున్న టీడీపీ నేతలు
ఇదీ ముదపాక
పెందుర్తి మండలం ముదపాకలో 1, 38, 76 సర్వే నంబర్లలో సుమారు 955 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఆయా భూములను 40 ఏళ్ల కిందట 450 మంది రైతులకు కేటాయిస్తూ పట్టాలు జారీ చేసింది. నాటి నుంచి ముదపాక, శివారు గ్రామం గోవిందపురం రైతులు ఆ భూముల్లో జీడి మామిడి, ఇతర పంటలు వేసి ఫలసాయం పొందేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములకు గ్రహణం పట్టింది. 2015–16లో వీఎంఆర్డీఏ(అప్పట్లో వుడా) ఆయా భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తుందన్న సమాచారంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ప్రకటన రాకముందే పక్కా ప్రణాళిక రచించారు. స్థానికంగా ఉన్న తమ బినామీల సాయంతో ‘త్వరలో ప్రభుత్వం మీ భూములను లాక్కొంటుంది. అప్పుడు ఎకరాకు రూ.2 లక్షలకు మించి ఇవ్వదు. అదే మాకు ఆ భూములు ఇచ్చేస్తే రూ.10 లక్షలు ఇస్తాం’ అని రైతులను ఆందోళనకు గురి చేసేలా ప్రచారం చేశారు. దీంతో అయోమయానికి గురైన రైతులు బినామీలు చెప్పినట్లే అడ్వాన్స్ కింద రూ.లక్ష, రెండు లక్షల చొప్పున తీసుకుని వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేశారు. దాదాపు 320 పట్టాలను ఇలా తెగనమ్ముకున్నారు. సుమారుగా 500 ఎకరాల భూములను మొత్తంగా రూ.10కోట్ల వరకు విక్రయించేశారు. వాస్తవంగా వీఎంఆర్‌డీఏ ధర ప్రకారం ఆ భూముల విలువ రూ.200కోట్లకు పైనే ఉంటుంది.
రికార్డుల మాయాజాలం
ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం.. ముదపాక రికార్డులను పరిశీలించేందుకు ప్రయత్నించింది. అయితే సర్వే నంబర్లు 1, 38, 76లకు సంబంధించిన ఏ రికార్డులు లేవని స్థానిక రెవెన్యూ అధికారులు అసలు విషయం చెప్పారు. దీంతో చేసేది లేక ఆ రికార్డులు లేవని ప్రకటన చేస్తూ.. ఆ భూముల్లో ప్రస్తుతం అనుభవంలో ఉన్న రైతుల ఆధారంగా సర్వే చేసి అందరికీ న్యాయం చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ.. మరుసటి రోజే సర్వే నంబర్లు 1, 38లకు సంబంధించిన రికార్డులు లభించినట్లు ప్రచారం జరిగింది. వివాదానికి కేంద్ర బిందువైన సర్వే నంబర్ 76 రికార్డులపై స్పష్టత లభించలేదు. ఈ సర్వే నంబర్‌లోని భూముల్లోనే ఆక్రమణదారులు అక్రమంగా చెట్లు నరికేయడం, రోడ్లు వేశారు. ఇదే సర్వేలోని భూముల నుంచి ఆక్రమణ పర్వానికి తెరతీశారు. అందుకే 76 సర్వే నంబర్ రికార్డులు మాయమయ్యాయని స్పష్టమవుతుంది.
సర్వేలోనే మాయాజాలం
‘ముదపాక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. ఇక్కడ ఎన్ని ఎకరాల భూములన్నాయి.? ఎంత మంది రైతులకు ఆ భూములు కేటాయించారన్నది తెలియడం లేదు. ఆ రికార్డులు వెతికే పనిలో ఉన్నాం.’ అని చెబుతూ ప్రభుత్వ ఆదేశాలతో జియోకాన్ సంస్థతో కలిసి అప్పటి అధికారులు సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలోనే అసలైన మాయాజాలం చోటుచేసుకుంటోంది. అప్పటి ప్రభుత్వం అండతో టీడీపీ నేతలు రైతులను భయపెట్టి లాక్కొన్న పట్టాలకు.. పుట్టుకొచ్చిన నకిలీ పట్టాదారులకు లబ్ధి చేకూర్చేలా సర్వే నిర్వహించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

