ఆదిలాబాద్‌టౌన్: పీఎంశ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని పీఎంశ్రీ పాఠశాలల రాష్ట్ర అబ్జర్వర్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో పీఎంశ్రీ నిధుల వినియోగంపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన నిధులను పకడ్బందీగా ఖర్చు చేయాలని సూచించారు. కేటాయించిన సమయంలోగానే వినియోగించాలని తెలిపారు. మొత్తం 64 అంశాలకు గాను 46 అంశాలను ప్రధానోపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేశారు. పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, రాష్ట్ర ఎఫ్‌ఎల్‌ఎన్ అధికారి సురేందర్, ఏఎంవో లక్ష్మణ్, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


