ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు విధుల నుంచి తొలగింపు
రెగ్యులరైజ్ అయిన వారి ధ్రువపత్రాలు మరోసారి పరిశీలన
జిల్లాలో ఇతర వర్సిటీ సర్టిఫికెట్లతో 28మంది జేఎల్‌లు
ఆదిలాబాద్‌టౌన్: గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా కొనసాగి రెగ్యులరైజ్ అయిన వారి సర్టిఫికెట్లపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ద్రువ పత్రాలు సమర్పించిన వారిపై కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో ముగ్గురిని ఉద్యోగం నుంచి తొలగించింది. జిల్లాలో మరికొందరిపై కూడా వేటు పడనుందనే ప్రచారం సాగుతోంది. దీంతో బోగస్ పత్రాలు సమర్పించిన వారిలో గుబులు మొ దలైంది. నకిలీ సర్టిఫికెట్ల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల పలు ఘటనలు వెలుగులోకి రావడంతో రెగ్యులర్ అయిన వారి సర్టిఫికెట్లను మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. సంబంధిత యూనివర్సిటీలకు సర్టిఫికెట్లను పంపించి విచారణ జరపనుంది. అవి నకిలీ అని తేలితే వెంటనే ఉద్యోగం నుంచి తొలగించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 35 మందిని విధుల నుంచి టెర్మినేట్ చేయగా.. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్మల్‌లో ఇద్దరు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు ఉన్నారు.
జిల్లాలో ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 112 మంది జూని యర్ లెక్చరర్లు గతంలో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేశారు. వీరందరినీ 2023 మే 4న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెగ్యులలరైజ్ చేసింది. మొదట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరిన సమయంలో కొందరు తప్పుడు ద్రువ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇప్పటికే రెండుసార్లు సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. బోగస్‌గా తేలిన వారిని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో రెగ్యులరైజ్ అయి న అందరి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలి స్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 28 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర యూనివర్సిటీల ద్వారా సర్టిఫికెట్లు సమర్పించారు. ఇందులో 18 మంది రెగ్యులర్ పద్ధతిన పీజీ పూర్తి చేయగా, మిగతా పది మంది డిస్టెన్స్‌లో పూర్తి చేశారు. వీరిలో కొందరు ప్రథ మ సంవత్సరం ఒక యూనివర్సిటీ, ద్వితీయ సంవత్సరం మరో యూనివర్సిటీలో చదివి న ట్లు సర్టిఫికెట్లు అందజేశారని సమాచారం. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టనుంది. వీరు యూనివర్సిటీలో చదివారా, లేకుంటే సర్టిఫికెట్లు తెచ్చుకున్నారా అనేది పరిశీ లనలో నిర్ధారించనున్నారు. డిసెంబర్ నాటికి ఈ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే బోగస్ లెక్చరర్లను ఉద్యోగం నుంచి తొలగించగా, మరి కొంత మందిపై వేటు పడుతుందా.. లేదా అనేది వేచి చూ డాల్సిందే. ఈ విషయమై డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు.


