ఆదిలాబాద్‌టౌన్: రైతు సమస్యలపై నవంబర్ 1న ఆదిలాబాద్‌లోని డైట్ మైదానంలో ‘రైతు గర్జన’ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం గ్రామ, పట్టణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ముందస్తు చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల కోసం పాదయాత్ర చేస్తానని ప్రకటించినప్పటికీ రెండుసార్లు నిలిచిపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం ఫోన్‌కాల్‌తోనే ఆగిపోతోందా అని ప్రశ్నించారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, వారి పక్షాన బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల నుంచి రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో లింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అజయ్, ఫ్లోర్ లీడర్ ప్రకాశ్, రమేశ్, గోవర్ధన్, నర్సింగరావు, ప్రహ్లాద్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్‌కు వినతి..
కై లాస్‌నగర్: పంటలు సాగు చేయవద్దనే సీఎం ప్రకటనతో రైతులు గందరగోళంలో ఉన్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ చిత్రూను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు సీఎం పంటలు వేయవద్దని చెబుతుండగా, మరోవైపు కలెక్టర్ సాత్నాల ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ 14 వరకు మూడు, నాలుగు విడతల్లో నీటిని విడుదల చేస్తామని ప్రకటించడం, అధికారికంగా శనగ విత్తనాల పంపిణీ చేపట్టడం రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. పంటలు సాగుపై ఎవరి మాట నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు.


