అటు.. ఇటు కరువు.. స్పందనలో తేడా! | - | Sakshi
Sakshi News home page

అటు.. ఇటు కరువు.. స్పందనలో తేడా!

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

మహారాష్ట్రలో 265 తాలూకాలకు కరువు ప్రకటన నిర్మల్‌లో 18.9 శాతం లోటు వర్షపాతం అటు ఉపశమన చర్యలు.. ఇటు ఎదురుచూపులు

భైంసా: ఒకే ఆకాశం, ఒకే నేల, దాదాపు ఒకే రకం పంటలు. అయినా వర్షాభావ పరిస్థితులపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల స్పందనలో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం వర్షాభావాన్ని అధికారికంగా గుర్తించి 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా, సరిహద్దును ఆనుకుని ఉన్న తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో లోటు వర్షపాతం కొనసాగుతున్నా ఇంకా నిర్ణయం రాలేదు.

మహారాష్ట్రలో కరువు..

మహారాష్ట్రలో మొత్తం 358 తాలూకాల్లో 265 తాలూకాలను (దాదాపు 74 శాతం) కరువు ప్రభావితంగా ప్రకటించారు. 34 జిల్లాల్లోని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. వర్షపాతం లోటు, 21 రోజులకు పైగా పొడి వాతావరణం వంటి అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు ప్రకటించిన ప్రాంతాల్లో భూమిశిస్తు రాయితీ, పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, వ్యవసాయ రుణాల వసూళ్ల వాయిదా, వ్యవసాయ పంపుల విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ, ఉపాధి పనుల విస్తరణ, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పశువులకు మేత, ఆహార ధాన్యాల సరఫరా వంటి చర్యలు చేపట్టనున్నారు. పంట నష్టాలపై పంచనామాలు, క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరిహారం మొత్తాన్ని అంచనా పూర్తయిన తర్వాత ప్రత్యేక ఉత్తర్వులతో ప్రకటిస్తారు.

నిర్మల్‌ జిల్లాలోనూ వర్షాభావం

మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉన్న నిర్మల్‌ జిల్లాలో కూడా వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. సెప్టెంబరు 27 నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 801 మి.మీ.కు గాను 649 మి.మీ. మాత్రమే నమోదై 18 శాతం లోటు నమోదైంది. 19 మండలాల్లో పది మండలాల్లో 21 నుంచి 42 శాతం వరకు లోటు ఉంది. తాజా గణాంకాల్లో లోటు మరింత పెరగడంతో పత్తి, సోయాబీన్‌ వంటి ప్రధాన వానాకాల పంటలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే సరిహద్దు మండలాల రైతులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. లోకేశ్వరం 14 శాతం లోటు ఉన్నప్పటికీ అధికారికంగా సాధారణ వర్షపాతంగా నమోదైంది. నిర్మల్‌ అర్బన్‌, దస్తురాబాద్‌ మండలాల్లో 4 శాతం లోటు ఉంది. అయితే పెంబిలో 10 శాతం, కడెం పెద్దూరులో 6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మామడలో సాధారణానికి దాదాపు సమీపంగా వర్షాలు కురిశాయి.

సరిహద్దు రైతుల ఆందోళన

భైంసా పరిసరాల నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తే సరిహద్దు కనిపించదు. రైతులు సాగు చేసే పంటల్లోనూ పెద్ద తేడా లేదు. వర్షం పడితే రెండు వైపులా లాభం, ముఖం చాటేస్తే రెండు వైపులా నష్టం. అయినా మహారాష్ట్ర ప్రభుత్వం వర్షాభావాన్ని గుర్తించి చర్యలు ప్రారంభించగా, తెలంగాణ వైపు లోటు వర్షపాతం, పంటలపై ప్రభావం ఉన్నప్పటికీ రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మల్‌ జిల్లా రైతులు పంటలు ఇంటికి వచ్చి పెట్టుబడులు తిరిగొస్తాయా అన్న ఆందోళనలో ఉన్నారు. వర్షాభావం కొనసాగితే పత్తిలో పూత, కాయలపైనా, సోయాబీన్‌లో దిగుబడిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

మండలాల వారీగా వర్షపాత లోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement