కై లాస్‌నగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో జిల్లాలోని వేలాదిమంది ఓటర్ల పే ర్లు తుది జాబితాలో చేర్చే అవకాశాలు కనిపించడం లేదు. మెజార్టీ ఓటర్లు నోటీసులకు నిర్ణీత గడువులోపు స్పందించడం లేదు. వీరు రీషెడ్యూల్‌కు దరఖాస్తు చేసుకుని విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారి ఓటు గల్లంతయ్యే అవకాశముంది. ఈ ప్రక్రియలో భోరజ్ మండలం అట్టడుగు స్థానంలో నిలిచింది. అనామలీస్, ఆన్‌మ్యాపింగ్ పేరిట జిల్లా వ్యాప్తంగా 1,50,425 మంది ఓటర్లకు నోటీసులు సిద్ధం చేసి బుధవారం నా టికి 1,24,019 మందికి అందజేశారు. నోటీస్ వచ్చిన రెండు, మూడు రోజుల్లో ఈఆర్వో/ఏఈఆర్వోల ఎదుట ఓటర్లు విచారణకు హాజరై గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని అందజేసి ఓటర్లుగా ధ్రువీకరించుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు 54,338 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 49,451 మంది ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను అధికారులకు ఇచ్చారు. దీంతో వీరి పేర్లన్నీ తుది జాబితాలో చేర్చేందుకు అవకాశముంది. కాగా, మరో 93,333 మంది విచారణకు హాజరుకాలేదు. వీరంతా రీ షెడ్యూల్ చేసుకుని తిరిగి విచారణకు హాజరై తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. కాగా, విచారణ రీ షెడ్యూల్ చేసుకున్న 28మంది కూడా తిరిగి విచారణకు రాలేదు. హాజరైన వారిలో 3,463 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అందులో ము గ్గురిని అనర్హులుగా తిరస్కరించగా మరో మూడు దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయి.
స్పందన అంతంత మాత్రమే..
నోటీసులు అందుకున్నవారు అధి కారిక విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 12 రకా ల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌మ్యాపింగ్‌కు సంబంధించి ఓటరుతో పాటు తమ తల్లిదండ్రు ల గుర్తింపు కార్డులూ విధిగా తీసుకురావాలనే బీఎల్వోల నిబంధనతో వెనుకాడుతున్నారు. అవగాహన రాహిత్యం, విచారణకు వెళ్లకుంటే ఏమమవుతోందనే బాధ్యతా రాహిత్యంతో మెజార్టీ ఓటర్లు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఓటర్ల వద్ద ఆధారాలను ధ్రువీకరించే గుర్తింపుకార్డులు అందుబాటులో లేకపోవడంతో ముందుకు రానట్లు సమాచారం. నిర్దేషిత కార్డుల్లో ఏదో ఒకటే చూపాలని ఈసీ నిర్దేశించగా బీఎల్వోలు రెండు, మూడు కార్డులు తప్పనిసరి అంటుండడంతో ప్రక్రియకు ఆటంకంగా మారుతోంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, రేషన్‌కార్డు లాంటివి ఈసీ జాబితాలో లేకపోవడం సమస్యగా మారింది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో 85,525 మందికి నోటీసులు సిద్ధం చేసి ఇప్పటివరకు 61,137 మందికి జారీ చేయగా, 24,388 పెండింగ్‌లో ఉన్నాయి. 21,971 మంది ఓటర్లు విచాణకు హాజరుకాగా ఇందులో సరైన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 19,547 మందిని ఓటర్ల తుది జాబితాలో చేర్చారు. మరో 63,314 మంది ఓటర్ల విచారణ గడువు ముగిసింది. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్‌లో 24,870 మందికి నోటీసులు సిద్ధం చేసి 12,336 మందికి జారీ చేశారు. ఇందులో 12,098 మంది మాత్రమే విచారణకు రాగా, 25,036 మంది విచారణ గడువు ముగిసింది.
జిల్లాలోని మొత్తం ఓటర్లు 4,03,625
సిద్ధం చేసిన ఓటర్ల నోటీసులు 1,50,425
నోటీసులు అందుకున్న ఓటర్లు 1,24,019
విచారణకు హాజరైన ఓటర్లు 54,338
హాజరుకాని ఓటర్లు 93,333
తుదిజాబితాలో చేర్చిన ఓటర్లు 49,451
బోథ్ నియోజకవర్గంలో..
బోథ్ నియోజకవర్గంలో 64,900 మంది ఓటర్లకు నోటీసులు సిద్ధం చేసి 62,882 మందికి జారీ చేయగా, ఇంకా 2,018 జారీ చేయాల్సి ఉంది. 32,367 మంది విచారణకు హాజరుకాగా, సరైన గుర్తింపుకార్డులు చూపించిన 29,904 మందిని తుది జాబితాలో చేర్చారు. మరో 30,019 మంది విచారణకు హాజరుకావాల్సి ఉండగా గడువు ముగిసింది. ఇచ్చోడలో 12,073 మందికి నోటీసులు సిద్ధం చేసి 11,966 మందికి జారీ చేయగా, 3,817 మంది మాత్రమే విచారణకు హాజరుకాగా 8,255 మంది గడువు ముగిసింది.


