● మంచి వర్షాలపైనే రైతుల ఆశలు
ఇక్కడ కనిపిస్తున్న రైతు లోలపు రమేశ్. అనుకుంట గ్రామం. ఈ వానాకాలంలో ఐదెకరాల్లో పత్తి వేశాడు. ఇప్పటికీ రూ.రెండున్నర లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు ఎదగాల్సిన స్థాయిలో ఎదగలేదు. పూత, కాత కూడా సరిగా లేదు. ఎంత దిగుబడి వస్తుందోననే ఆందోళన ఆ రైతులో కనిపిస్తోంది. ఇది ఒక్క రమేశ్ పరిస్థితే కాదు.. జిల్లాలోని పత్తి రైతులందరిదీ.
ఓపెన్ మార్కెట్లో పత్తి ధర క్యాండీ (3.65 కేజీలు), సీడ్, సర్కి పిండి వంటివి ప్రమాణంగా తీసుకొని ధరలు కొనసాగుతాయి. రెండు పత్తి బేల్స్ కలిపితే ఓ క్యాండీ తయారవుతుంది. దాని ధర ప్రస్తుతం రూ.69వేల వరకు కొనసాగుతుంది. సీడ్ ధర క్వింటాలుకు రూ.4,500 ఉంది. సర్కి పిండి ధర కూడా క్వింటాలుకు రూ.3500 నుంచి 4వేల ధర పలుకుతుంది. ఈ లెక్కన ఓపెన్ మార్కెట్లో క్వింటాలు పత్తి ధర రూ.9వేలుగా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
జిల్లాలో పత్తి సాగు వివరాలు..
సాగైన విస్తీర్ణం : 4,37,698 ఎకరాలు
దిగుబడి అంచనా : 40లక్షల నుంచి
52 లక్షల క్వింటాళ్ల వరకు
(ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు)
మద్దతు ధర : పొడవు పింజకు రూ.8,667 (క్వింటాలుకు)
సాక్షి,ఆదిలాబాద్: పత్తి దిగుబడిపై రైతుల్లో అనిశ్చితి కనిపిస్తుంది. ఎల్‌నినో కారణంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, మొక్కలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో వారిలో దిగాలు కనిపిస్తోంది. పూత, కాత కూడా సరిగా రాకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతుంది. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వర్షాభావం పరిస్థితులు కొనసాగితే అందులో సగం కూడా వస్తుందో.. లేదోననే ఆందోళన రైతుల్లో లేకపోలేదు. అయితే ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం మద్దతు ధర మించి పత్తికి రేటు పలుకుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొంత దిగుబడి తగ్గినా ధరల కారణంగా ఆ వ్యత్యాసాన్ని పూరించుకోవచ్చని ఽభావిస్తున్నారు. అయితే సీజన్ ప్రారంభమయ్యే నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం.
అప్పటివరకు కొనసాగేనా..
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేల్స్, సీడ్‌కు మంచి డిమాండ్ ఉండడంతో ధర అనుకూలంగా ఉంది. పత్తి కొనుగోళ్ల సీజన్ జిల్లాలో అక్టోబర్ 3వ వారంలో మొదలయ్యే పరిస్థితి ఉంది. అప్పటివరకు ఇలాగే ఉంటుందా.. డిమాండ్ కొనసాగుతుందా.. అలా కాకుండా ఆ ధరలు పడిపోతే ఇక్కడ ఓపెన్ మార్కెట్లో పరిస్థితి తారుమారు అవుతుందా.. అనే సందిగ్ధం రైతుల్లో లేకపోలేదు.


