ఆదిలాబాద్: విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 17న ప్రతీబూత్ స్థాయిలో జాతీయ జెండా ఆవిష్కరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోదీ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను దీవించేలా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ఎదుట ఆశీర్వాద దీపం వెలిగించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ తదితరులు పాల్గొన్నారు.


