కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణం కేఆర్‌కే కాలనీలో గల చెరువును ఆక్రమించి చేపట్టిన అక్ర మ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. కాలనీకి చెందిన యువకులు గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని అక్కడే ఉన్న బల్దియా కమిషనర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు మంగళవారం చెరువును సందర్శించారు. అందులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలతో పాటు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని పొక్లెయిన్‌తో కూల్చివేశారు. అలాగే చెరువులో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన యజమానులకు వాటిని తొలగించాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. స్పందించకుంటే మున్సిపల్ ద్వారా వాటిని కూల్చివేస్తామని పట్టణ ప్రణా ళిక విభాగం అధికారులు సుమలత, నవీన్‌కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ప్రేసింగ్, మావల సీఐ ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.


