బకాయిల గుదిబండ | - | Sakshi
Sakshi News home page

బకాయిల గుదిబండ

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

● బల్దియా పరిధిలో రూ.1.26 కోట్ల అద్దె పెండింగ్‌ ● వసూళ్లపై దృష్టి సారించని అధికారులు ● మున్సిపల్‌ ఖజానాపై తీవ్ర ప్రభావం

మున్సిపల్‌ కార్యాలయం పాత భవనం వద్ద గల షాపునంబర్‌ 39కి సంబంధించిన అద్దె అత్యధికంగా రూ.4,49,976 బకాయి ఉండగా.. 38వ దుకాణానికి సంబంధించి రూ.4,26,964 చెల్లించాల్సి ఉంది. అలాగే ఓల్డ్‌ బస్టాండ్‌ ప్రాంతంలో గల 8వ నంబర్‌ షాపునకు సంబంధించి రూ.2.30,912 బకాయి ఉండగా, 6వ దుకాణానికి సంబంధించి రూ.1,84,829 మేర అద్దె బకాయిలు పేరుకుపోయాయి. కొద్ది నెలలుగా వ్యాపారులు అద్దె చెల్లించకపోవడంతో ఇలా భారీగా పేరుకుపోయాయి.

కై లాస్‌నగర్‌: మున్సిపల్‌కు సంబంధించిన వాణిజ్యసముదాయ షాపుల అద్దె బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయి బల్దియాకు గుదిబండగా మారుతున్నాయి. పలువురు వ్యాపారులు ప్రతి నెలా అద్దె చెల్లించడంలేదు. రెగ్యులర్‌గా వసూలు చేయాల్సిన సిబ్బంది సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న 83 దుకాణాలకు గాను ఏకంగా రూ.కోటి 26లక్షల 8వేల 733 వరకు అద్దె పెండింగ్‌లో ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. బల్దియాకు ఉన్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఆస్తిపన్ను తర్వాత కీలకం ఈ మడిగెల అద్దెనే. అయితే ఇవి సక్రమంగా వసూలు కాకపోవడంతో మున్సిపల్‌ అభివృద్ధి పనులతో పాటు కార్మికుల జీతాల చెల్లింపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పేరుకుపోతున్న బకాయిలు

గ్రేడ్‌–1స్థాయి కలిగిన ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి పట్టణంలోని మూడు ప్రాంతాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఇందులో మున్సిపల్‌ ఓల్డ్‌ కార్యాలయం వద్ద అత్యధికంగా 40 షాపులున్నాయి. అలాగే ప్రధాన వాణిజ్య ప్రాంతమైన శివాజీచౌక్‌లో 19, ఓల్డ్‌ బస్టాండ్‌ ఏరియాలో 9 దుకాణాలు ఉన్నా యి. వీటిన్నింటిని ఓపెన్‌ టెండర్‌ ద్వారా వ్యాపారులకు అద్దెకు కేటాయించారు. ప్రస్తుతం వీటన్నింటిలో వ్యాపారాలు జరుగుతున్నాయి. అయితే ఓల్డ్‌ బ స్టాండ్‌ ప్రాంతంలోనే మరో 15 చికెన్‌, మటన్‌ విక్ర య దుకాణాలున్నాయి. ఇక్కడ ఎప్పటి మాదిరిగానే చికెన్‌, మటన్‌ విక్రయాలు కొనసాగుతున్నా వీటికి బల్దియా అధికారులు అద్దె వసూలు చేయడం లేదు. గదులు శిథిలావస్థకు చేరాయనే ఉద్దేశంతో వీటికి మినహాయింపునిచ్చారు. దీంతో వీటి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మొత్తం బకాయిల్లో ఇవే అత్యధికంగా రూ.98,47,545 పేరుకుపోవడం గమనార్హం. ఏళ్లుగా వసూలు చేయకపోవడంతో ఇవి మొండి బకాయిలుగా మారాయి. మిగతా చోట్లలోని షాపులకు సంబంఽధించి కూడా కొంతమంది రెగ్యులర్‌గా చెల్లించడం లేదు. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి.

బల్దియా ఖజానాపై ఎఫెక్ట్‌..

బల్దియాలో కార్యాలయ నిర్వహణ, కార్మికుల జీతభత్యాల చెల్లింపునకు ఆస్తిపన్ను తర్వాత మడిగెల అద్దెలే కీలకమవుతున్నాయి. ఇంతటి ప్రధానమైన అద్దెల వసూళ్లపై రెవెన్యూ యంత్రాంగం అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో కొంతమంది వ్యాపారులు సైతం ఇస్తాం లే.. చూద్దాం లే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి అద్దె చెల్లించడం లేదు. ఫలితంగా మున్సిపల్‌ అభివృద్ధి పనులతో పాటు కార్మికుల వేతన చెల్లింపులకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పట్టణంలోని మున్సిపల్‌ మడిగెలు,

వాటి అద్దె బకాయిల వివరాలు

ఏరియా మడిగెలు బకాయిలు

శివాజీచౌక్‌ 19 రూ.1,57,869

ఓల్డ్‌బస్టాండ్‌ 09 రూ.4,47,163

ఓల్డ్‌బస్టాండ్‌ 15 రూ.98,47,545

మున్సిపల్‌ ఓల్డ్‌బిల్డింగ్‌ 40 రూ.22,29,156

నోటీసులు జారీ చేస్తున్నాం

మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ మడిగెల అద్దెలను ఎప్పటికప్పుడు వసూలు చేసేలా దృష్టి సారిస్తున్నాం. బకాయిలు వసూలు చేసేలా వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తాం. నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. అప్పటికీ స్పందించకుంటే షాపులు సీజ్‌ చేసి వారికి కేటాయించిన అగ్రిమెంట్‌ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటాం.

– బి.కళ్యాణ్‌, బల్దియా రెవెన్యూ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement