కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను త్వరలో ఢిల్లీకి తీసుకెళ్లి పట్టణానికి ప్రత్యేక ప్రాజెక్ట్ తీసుకొచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 41,12,18,19,35 వార్డుల పరిధిలో గల కాలనీల్లో యుఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. చైర్‌పర్సన్ అనూషతో కలిసి ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో గొప్పగా మారబోతుందని, కార్పొరేషన్ సైతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టుతో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ వస్తున్నాయని తెలిపారు. కేంద్రం అమృత్ పథకం కింద వార్డుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మౌనిక, అన్నపూర్ణ, సాయి, జీవన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


