ఆధారాలతో ఫిర్యాదు.. | - | Sakshi
Sakshi News home page

ఆధారాలతో ఫిర్యాదు..

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

విద్యాసంస్థల ఆగడాలకు చెక్‌ పెట్టేలా..

నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక చర్యలు

ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుకు అవకాశం

ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో హర్షం

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల ఆగడాలు మితిమీరుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, యూనిఫాం ఒకే షాపులో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం, అడ్వాన్స్‌ ఫీజులు చెల్లించాలని, మౌలిక వసతులు లేకపోయినా అందినకాడికి దోచుకోవడం, అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం పరిపాటిగా మారింది. విద్య శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు చేసేదేమి లేక మిన్నకుండి పోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ ద్వారా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ఆన్‌లైనద్వారా ఫిర్యాదు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను రూపొందించింది.

ఫీజుల వసూళ్లపై నిఘా..

ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి. స్కూల్‌ ఫీజుతోపాటు వివిధ రకాల పేర్లతో యాజమాన్యాలు అదనపు రుసుములు వసూలు చేయడం, ముందస్తుగా భారీ మొత్తాలను చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి వాటితో పేరెంట్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్‌ ఆగడాలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. తద్వారా అధికారులు పాఠశాలలపై మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ చేపట్టనున్నారు. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోటుబుక్‌లు, యూనిఫాం, షూలు, ఇతర విద్యా సామగ్రిని వారు సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే వస్తువులను పాఠశాల సూచించిన దుకాణాల్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫీజుల వివరాలను నోటీసు బోర్డులపై తప్పనిసరిగా ప్రదర్శించాలి. టర్మ్‌, ట్రాన్స్‌పోర్టు ఫీజు, ఇతర వివరాలు అన్ని విడివిడిగా పేర్కొనాలి.

తల్లిదండ్రులు తమ సమస్యను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. సమస్యలు, ఫిర్యాదులను వెబ్‌సైట్‌ www.schooledu.telangana.gov. in, pscms లో మొబైల్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ కావచ్చు. ఓటీపీ ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. అలాగే ఫిర్యాదు పరిస్థితిని ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఫీజు రశీదులు, పాఠశాల నుంచి వచ్చిన సందేశాలు, పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని ఇచ్చిన సూచనలు తదితర ఆధారాలను ఫిర్యాదుతో జతచేయవచ్చు. ఫిర్యాదు అందిన అనంతరం సంబంధిత అధికారులు అంశాన్ని పరిశీలించి, అవసరమైతే పాఠశాల యాజమాన్యం నుంచి వివరణ అడుగుతారు. తదనుగుణంగా చర్యలు

చేపడుతారు.

ఫిర్యాదులపై అధికారుల పరిశీలన..

ఆన్‌లైన్‌లో నమోదయ్యే ఫిర్యాదులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించనున్నారు. ఆ తర్వాత జిల్లా విద్య శాఖాధికారులకు సమాచారం అందిస్తారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు, హెచ్చరికలు జారీతో పాటు నిబంధనల ఉల్లంఘన తీవ్రత బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్‌ పాఠశాలలపై ఫిర్యాదు చేయాలంటే తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి రావడంతో ఇక ఇంటి నుంచే ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement