కై లాస్‌నగర్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హులు, మృతులు, డూప్లికేట్, చిరునామా మారిన ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిచేయాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం–6 దరఖాస్తులు, డిక్లరేషన్ ఫారాలు, ధ్రువపత్రాల సమర్పణ, ఓటర్ల పరిశీలన, నోమ్యాపింగ్, వివిధ అనామలీస్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా చూడటమే ప్రక్రియ ప్రధాన ఉద్దేశమన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం అర్హత కలిగిన కొత్త ఓటర్లు ఫారం–6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫారం–6తో పాటు నిబంధనల ప్రకారం అవసరమైన డిక్లరేషన్ ఫారం, సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, నోమ్యాపింగ్, అనుమానాస్పద వివరాలు, ఇతర అనామలీస్‌ను గుర్తించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్‌వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, నగేష్, సంజీవ్ కుమార్, మోహన్, వెంకటస్వామి, ప్రశాంత్, లక్ష్మి, ఎండీ అఫ్రీద్, శుభన్ అలీ, వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత, మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌లో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఉద్యమశీలత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జన్ శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్స్ మోడల్ సెంటర్’ నమూనాల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ హాజరై శిక్షణ పొందిన అభ్యర్థులు రూపొందించిన చేతివృత్తులు, కుట్టుపని, వివిధ వృత్తి విద్య ఉత్పత్తులు, ఇతర నైపుణ్య ఆధారిత నమూనాలను తిలకించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్‌రావు, డీఈవో మాధవి, ఎల్‌డీఎం ఉత్పాల్, సైడ్స్ డైరెక్టర్ సురేందర్, అధికారులు, జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రతినిధులు, అభ్యర్థులు పాల్గొన్నారు.


