ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు యూనిఫాంల కోసం ఎదురుచూస్తున్నారు. బడులు ప్రారంభమై మూడు నెలలైనా ఇంకా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయలేదు. పాఠశాలలు తెరిచిన మొదటిరోజే ఒక జత పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. గత నె లలో కొన్ని పాఠశాలలకు వస్త్రం రాగా, ఈ నెలలో మిగతా బడులకు వచ్చింది. ఈనెల 31వరకు రెండు జతల యూనిఫాంలు విద్యార్థులకు అందజేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితులు కానరావడం లేదు. జిల్లాలో ఒకట్రెండు పాఠశాలలకే ఒక జత యూనిఫాం పంపిణీ చేశారు. బూట్లు పాఠశాలలకు చేరగా పలువురు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇంకా సాక్స్‌లు, బెల్ట్‌లు, టైల జాడే లేదు. గురువారం ‘సాక్షి’ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల ను విజిట్ చేయగా, విద్యార్థులు పాత యూ నిఫాంలు, సివిల్ దుస్తుల్లోనే కనిపించారు. యూనిఫాంల కుట్టు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు.
ఎదురుచూస్తున్న విద్యార్థులు
విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. జిల్లాలో డీఈవో పరిధిలో 690 ప్రభుత్వ యాజ మాన్య పాఠశాలలున్నాయి. వీటిలో 60,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయాల్సి ఉంది. ఏటా జూన్, జూలైలోనే పంపిణీ చేయగా, ఈసారి ఆగస్టు పూర్తి కావస్తున్నా
ఇంకా అందలేదు. గతంలోని యూనిఫాం రంగు మార్చి ఈసారి కొత్తవి ఇవ్వనున్నారు. ఏప్రి ల్, మేలో రావాల్సిన వస్త్రం జూలై, ఆగస్టులో పాఠశాలలకు చేరింది. దీంతో యూనిఫాంలు కుట్టడంలో జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు పాత యూనిఫాంలు, సివిల్ దు స్తుల్లోనే వస్తున్నారు. కొత్త యూనిఫాంలు ఎప్పుడిస్తారోనని ఎదురుచూస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వీటిని కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం కానరావడం లేదు. అయితే, అధికారులు మా త్రం ఈనెల 31వరకు రెండు జత ల యూనిఫాంలు అందిస్తామని చెబుతున్నారు.
సివిల్ దుస్తుల్లో ఇచ్చోడ మండలం అడిగామ విద్యార్థులు
సాత్నాల మండలం జామ్ని పాఠశాలలో..
నేరడిగొండ మండలం కొర్టికల్ ఆశ్రమ పాఠశాలలో..


