కైలాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, వడ్డీ లేని రుణాలిస్తున్నాయి. వారి స్వయం ఉపాధి కల్పనకు చేయూతనందిస్తున్నాయి. ఈ రుణాల మంజూరు, చెల్లింపుల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా లోకోస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని అమలులో భాగంగా సంఘాల్లోని ప్రతీ సభ్యురాలి ఈకేవైసీ నమోదు చేయిస్తున్నారు. తద్వారా సభ్యుల వాస్తవ డాటా అందుబాటులోకి వచ్చి రుణాల మంజూరులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా పారదర్శకత పెరుగనుంది. జిల్లాలో ఈకేవైసీ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
యాప్‌లో సమగ్ర సమాచారం
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతీ సభ్యురాలి ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్‌తో పాటు వారి ఈకేవైసీ వివరాలను లోకోస్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. తద్వారా సంఘాల్లోని సభ్యుల సంఖ్య వాస్తవంగా తెలియడంతో పాటు ఈకేవైసీ వివరాల నమోదు ద్వారా వారు పొందిన రుణాలు, చెల్లింపులు లాంటి వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నేరుగా పర్యవేక్షించేందుకు అవకాశమేర్పడుతుంది. రుణాల మంజూరులో ఇదే డాటా కీలకం కానుండటంతో బోగస్ రుణాలకు చెక్ పడనుంది. అలాగే, మరణించిన సభ్యులు, ఎలాంటి పొదుపు చేయనివారి వివరాలు తొలగించేందుకు ఆస్కారమేర్పడుతుంది. వాస్తవికతతో కూడిన డాటా అందుబాటులోకి రానుంది.
జిల్లాలో 2,278 మంది ఈకేవైసీ పూర్తి
రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇటీవలే ప్రారంభమైంది. ఆధార్ నంబర్‌తో ఫేస్ అఽథెంటికేషన్‌ను (ఫేస్ స్కానింగ్), ఓటీపీ ద్వారా లోకోస్ మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 20 మండలాల పరిధిలో 90,853 మంది సభ్యులుండగా ఇందులో ఇప్పటివరకు 85,372 మంది సభ్యుల బ్యాంక్ ఖాతాల వివరాలు నమోదు చేశారు. ఈ ప్రక్రియ 93.97శాతం పూర్తయింది. 77,737 మంది సభ్యుల ఆధార్ వివరాలు సేకరించారు. అలాగే, 89,862 మంది సభ్యుల మొబైల్ నంబర్లు నమోదు చేశారు. ఇందులో ఇప్పటివరకు ఆధార్‌తో కూడిన 2,278 మంది సభ్యుల ఈకేవైసీని పూర్తిచేశారు.
జిల్లాలోని గ్రామీణ మండలాలు 20
స్వయం సహాయక సంఘాలు 11,446
సంఘాల్లోని సభ్యులు 90,853
ఈకేవైసీ పూర్తయిన సభ్యులు 2,278
తలమడుగులో
అత్యధికం
సభ్యుల ఈకేవైసీ నమోదులో తలమడుగు మండలం అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ మండలంలో 529 మంది సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 532, ఆదిలాబాద్ రూరల్‌లో 312, తాంసిలో 158, ఇంద్రవెల్లిలో 135, భీంపూర్‌లో 131, నేరడిగొండలో 129, మావలలో 91, నేరడిగొండలో 71, నార్నూర్‌లో 71, జైనథ్‌లో 63, బోథ్‌లో 35, బేలలో 25, సిరికొండలో 10, బజార్‌హత్నూర్‌లో 14, గుడిహత్నూర్‌లో 12, ఇచ్చోడలో 10, భోరజ్‌లో 2, గాదిగూడలో ఒకరి ఈకేవైసీ వివరాలు ఇప్పటివరకు నమోదు చేశారు. కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలంలో ఇప్పటివరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.


