కై లాస్‌నగర్: గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పాలనపరంగా ప్రజలకు సేవలందించాల్సిన రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌తోపాటు పారిశుద్ద్యం వంటి కీలక వి భాగాల్లో అధికారుల పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ విస్తరణకు ముందు మంజూరైన పోస్టుల్లోనే సగానికిపైగా ఖాళీలు ఉండటం గమనార్హం. ఫలితంగా ఉన్నవారిపై అదనపు పనిభారంతో పాటు ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సైతం కొరవడుతుంది. పట్టణ జనాభా, అవసరాలకనుగుణంగా పోస్టులు పెరగాల్సి ఉండగా ఉన్న పోస్టులే ఖాళీగా ఉండడం పట్టణాభివృద్ధిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పట్టణ అభివృద్ధిపై ప్రభావం..
49 వార్డులు, 1.50లక్షలకు పైగా జనాభా కలిగిన ఆదిలాబాద్ మున్సిపల్‌లో పలు కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదు నెలల క్రితం అసిస్టెంట్ కమిషనర్‌గాబాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ 15రోజుల్లోనే క్యాతన్‌పల్లికి పదోన్నతిపై బదిలీ అయ్యారు. దీంతో ఈ పోస్టు దాదాపు మంజూరు నుంచి ఖాళీగానే ఉంటుంది. మున్సిపల్ ఇంజినీర్ పోస్టు పరిస్థితి ఇలాగే ఉంది. ఇది వరకు పనిచేసిన పేరిరాజు నిజామాబాద్ కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లడంతో ఈ పోస్టులో ఇన్‌చార్జి అధికారి కొనసాగుతున్నారు. పట్టణంలో జరిగే అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలుకుని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈపై ఉంటుంది. ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతంంది. మున్సిపాలిటీకి మంజూరయ్యే నిధులు, చేస్తున్న ఖర్చులు, ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాల లెక్కలను చూడాల్సిన మరో కీలకమైన అకౌంటెంట్ పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. ఇది వరకు పనిచేసిన అధికారి ఏసీబీకి పట్టుబడటంతో ఖాళీ అయింది. అకౌంటెంట్‌తో పాటు సహాయకులగా వ్యవహరించాల్సిన సీనియర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. దీంతో కార్యాలయంలోని ఉద్యోగులతో ఈ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది.
మరికొన్ని విభాగాల్లో..
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రజారోగ్యం కాపాడటంలో పారిశుద్ధ్య విభాగం కీలకపాత్ర పో షిస్తుంది. అయితే ఈ విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడంలేదు. అలాగే పట్టణంలో ఆక్రమణల కట్టడితో పాటు భవన నిర్మాణ అనుమతులను పర్యవేక్షించాల్సిన పట్టణ ప్రణాళిక విభా గంలోనూ పలు కీలక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రజాసేవలపై పడుతుంది. మున్సిపల్ కార్యాలయ నిర్వహణతో పాటు ఉత్తర, ప్రత్యుత్తరాలను పర్యవేక్షించాల్సిన మేనేజర్ పోస్టు సైతం భర్తీకి నోచుకోవడం లేదు. ఇది వరకు పనిచేసిన మేనేజర్ ఏడాదిక్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ఇన్‌చార్జి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉండటంతో బల్దియా పాలనపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నధికారులు, ప్రజాప్రతినిధులు స్పందింది ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.
మున్సిపల్‌లో ఖాళీగా
ఉన్న పోస్టుల వివరాలు
అసిస్టెంట్ కమిషనర్ 01
శానిటరీ ఇన్‌స్పెక్టర్ 02
సూపర్‌వైజర్ 01
హెల్త్ అసిస్టెంట్లు 02
మేనేజర్ 01
అకౌంటెంట్ 01
సీనియర్ అకౌంటెంట్ 01
జూనియర్ అకౌంటెంట్ 01
టీపీబీవో 03
టీపీఎస్ 02
ఏసీపీ 01
యూడీఆర్‌ఐ 01
ప్రభుత్వానికి నివేదించాం
మున్సిపల్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న మా ట వాస్తవమే. వీటిని భర్తీ చేయాలని కోరు తూ ఇదివరకే ప్రభుత్వానికి నివేదించాం. మరోసారి తాజా ఖాళీలతో ప్రతిపాదనలు పంపిస్తాం. – ఎస్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్


